Chiranjeevi: 2024 ఎన్నికల్లో తమ్ముడి కోసం చిరంజీవి రణరంగంలోకి దిగనున్నారా?

చిరంజీవి ఇన్నాళ్లు తటస్థంగా కనిపించినా.. తాజా వ్యాఖ్యలతో జనసేనాని పక్షం వహించనున్నట్లు తేలిపోయింది. ఇక ఎన్నికల్లో విపక్షంతోపాటు సినీ పరిశ్రమతోనూ వైసీపీ యుద్ధం చేయకతప్పదనేది క్లియర్‌కట్.

Chiranjeevi, Pawan Kalyan

Chiranjeevi – Janasena: జనసేనాని పవన్ కల్యాణ్ కు (Pawan Kalyan) తోడుగా అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారా? ఇన్నాళ్లు రాజకీయాలకు రాం రాం చెప్పేసినట్లు సైలెంట్‌గా ఉన్న చిరంజీవి.. సడన్‌గా రూటు మార్చారా? 2014 ఎన్నికల తర్వాత సినీ రంగానికే పునరంకితమైనట్లు కనిపించిన మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఉన్నట్టుండి ప్రత్యేక హోదా (Special Status) అభివృద్ధిపై ఎందుకు మాట్లాడారు? తనకు ఇష్టమైన బ్రో (Bro) పవన్ సినిమాపై అధికార పార్టీ పెద్దలు కన్నెర్రజేయడం నచ్చలేదా? లేక ఎప్పటికైనా తన ముద్దల తమ్ముడు ముఖ్య పదవి అధిష్టించాలని అభిలషిస్తున్న అన్నయ్యకు కర్తవ్యం గుర్తుకొచ్చిందా? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హీట్ పుట్టించిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) కామెంట్లకు కారణమేంటి?

ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్లు హీట్ పుట్టిస్తున్నాయి. బ్రో సినిమాలో శ్యాంబాబు డ్యాన్స్‌తో మొదలైన వివాదం.. వాల్తేరు వీరయ్య సినిమా టూ హాన్‌డ్రెడ్ డేస్ ఫంక్షన్‌లో చిరంజీవి కామెంట్లతో మరింత రాజుకుంది. శ్యాంబాబు డ్యాన్స్‌తో హర్ట్ అయిన మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సినిమా బృందంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిర్మాతపైనా.. మాటల రచయిత త్రివిక్రమ్‌పైన విమర్శలు చేశారు. బ్రోకు పోటీగా మ్రో సినిమా తీస్తానని చెప్పారు. అంతేకాదు ఢిల్లీకి వెళ్లి ఈడీకి ఫిర్యాదు చేశారు.. ఈ ఎపిసోడ్ ఇప్పుడిప్పుడే సైలెంట్ అవుతుందనగా.. చిరంజీవి వ్యాఖ్యలతో మళ్లీ అగ్గి రాజుకుంది. ఇన్నాళ్లు చిరంజీవి అంటే తమకెంతో మర్యాద అని చెప్పిన వైసీపీ.. వాల్తేరు వీరయ్య వేదికగా చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి బొత్స, మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ నందిగం సురేశ్ ఇలా ఒక్కొక్కరూ చిరంజీవిపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు.

Chiranjeevi

”మీలాంటివాళ్లు ప్రత్యేక హోదా గురించి.. అభివృద్ధి పనుల కోసం మాట్లాడాలి. పేదల ఆకలితీర్చే పథకాలు ప్రవేశపెట్టాలి.. అలా చేస్తే మేం రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం కానీ పిచ్చుకపై బ్రహ్మస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటి?” అంటూ నేరుగా ఏపీ ప్రత్యేక హోదా సాధించలేదనే అంశాన్ని ఎత్తిచూపుతూ అధికార పార్టీపై విమర్శలు చేశారు చిరంజీవి. ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్క రోజు ముందు భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన పార్టీలో యాక్టివ్‌గా తిరుగుతున్న కమెడియన్ హైపర్ ఆది.. చిరంజీవి సమక్షంలోనే వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. సినిమా ఫంక్షన్‌లో రాజకీయాలు మాట్లాడటంపై ఏమాత్రం అభ్యంతరం చెప్పని చిరంజీవి.. స్వయంగా వైసీపీపై విమర్శలకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

వాల్తేరు వీరయ్య ఫంక్షన్‌లో చిరంజీవి వ్యాఖ్యలతో అంతా కంగుతిన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) పెట్టిన చిరంజీవి.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన.. ఆ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినా ఎప్పుడూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. జనసేనకు మద్దతుగా కాని.. వ్యతిరేకంగా కాని ఎక్కడా మాట్లాడలేదు. చివరికి తన తల్లిని తూలనాడినా రాజకీయంగా చూశారే గాని.. రాజకీయాలతో సంబంధం లేని తల్లిని ఎందుకు అవమానిస్తారని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాంటి చిరంజీవి ఇప్పుడు ఉన్నట్టుండి.. అదీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ ప్రజల చిరకాల వాంఛగా మిగిలిన ప్రత్యేక హోదాపై గళం విప్పడం రాజకీయంగా ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read: చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని రియాక్షన్.. ఇండస్ట్రీలో పకోడీ గాళ్లు..

వాస్తవానికి ఇన్నాళ్లు చిరంజీవి, వైసీపీ మధ్య మంచి సంబంధాలే ఉండేవి. వైసీపీకి సినిమా రంగం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదన్న సందర్భంలో కూడా చిరంజీవి.. సీఎం జగన్‌తో స్నేహ పూర్వకంగానే మెలిగారు. చిరంజీవి తాడేపల్లిలో జగన్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు కోసం ఇతర సినీ రంగ ప్రముఖలతో కలిసి జగన్‌ను కలిశారు. అప్పుడు కూడా సీఎం జగన్ పట్ల ఎంతో వినయ విధేయత ప్రదర్శించారు చిరంజీవి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు భేషరతుగా మద్దతు పలకడంతోపాటు.. రెండు లేఖలు విడుదల చేశారు. ఇలా నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీతో స్నేహంగా ఉంటూ.. తనకు రాజకీయాలకు సంబంధంలేదని చాటుకున్న చిరంజీవి.. ఒక్కసారిగా రాజకీయ విమర్శలకు దిగడమే హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: చిరంజీవి ఎప్పుడూ ఇలానే మాట్లాడితే బాగుంటుంది.. మంచి చేసినప్పుడు కూడా..

మరోవైపు వైసీపీ కూడా ఎప్పుడూ చిరంజీవిని రాజకీయాల్లోకి లాగలేదు. ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసినప్పుడు కూడా.. వైసీపీ, జనసేన మధ్య మాత్రమే మాటల యుద్ధం జరిగేది. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసేందుకు కూడా వెనుకాడని వైసీపీ.. ఎప్పుడూ చిరంజీవి జోలికి వెళ్లలేదు. సినీ హీరోగా చిరంజీవిని అభిమానిస్తానని మంత్రి రోజా (Minister Roja) గతంలో చాలా సార్లు చెప్పారు. బ్రో వివాద సమయంలో కూడా మంత్రి అంబటి రాంబాబు.. పవన్‌పై విమర్శలు చేస్తూ చిరంజీవి పట్ల మర్యాద చూపారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు వైసీపీ టార్గెట్‌లో లేని చిరంజీవి కూడా తాజా వ్యాఖ్యలతో విమర్శల దాడిని ఎదుర్కోవాల్సివచ్చింది.

Also Read: రాష్ట్రానికి మోసం చేసిన వ్యక్తుల్లో చిరంజీవి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.. సీదిరి అప్పలరాజు

చిరంజీవి విమర్శలు.. వైసీపీ ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయం గరం గరంగా మారింది. సినీ వేదికపై నుంచి చిరంజీవి పొలిటికల్ కామెంట్స్‌పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తన తమ్ముడు చాలా గొప్పోడు.. ఎప్పటికైనా పెద్ద పదవిని.. ముఖ్య పదవిని చేపడతాడని నమ్మకం ఉందని గతంలో వ్యాఖ్యానించిన చిరంజీవి.. 2024 ఎన్నికల్లో తమ్ముడి కోసం రణరంగంలోకి దిగనున్నారా? అన్న చర్చ మొదలైంది. పదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు సంకేతాలిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాయే ప్రధాన అజెండాగా పనిచేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగన్నరేళ్లలో హోదాపై ఎలాంటి కదలిక లేదు. ఇప్పుడు అదే అంశాన్ని లేవనెత్తేలా చిరంజీవి మాట్లాడటంతో వైసీపీ విమర్శలు మొదలు పెట్టింది. ఇది ఇప్పటితే ఆగేది కాదని.. ఎన్నికల వరకు చిరంజీవి, పవన్ లక్ష్యంగా వైసీపీ మాటల దాడి కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఈ ఇష్యూతో అధికార వైసీపీకి సినీ పరిశ్రమతో గ్యాప్ ఉందనే విషయం మరోసారి బయట పడింది. సినీ పరిశ్రమ నుంచి ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులే జగన్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. చిరంజీవి ఇన్నాళ్లు తటస్థంగా కనిపించినా.. తాజా వ్యాఖ్యలతో జనసేనాని పక్షం వహించనున్నట్లు తేలిపోయింది. ఇక ఎన్నికల్లో విపక్షంతోపాటు సినీ పరిశ్రమతోనూ వైసీపీ యుద్ధం చేయకతప్పదనేది క్లియర్‌కట్.. చిరంజీవి, వైసీపీ మధ్య మాటల యుద్ధమే హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు