Chandrababu Davos Tour: దావోస్‌లో స్పీడ్ పెంచిన చంద్ర‌బాబు బృందం.. లక్ష్మీమిట్టల్ సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు

దావోస్ లోని బెల్వేడార్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు.

CM Chandrababu and Nara Lokesh met industrialist Lakshmi Mittal in Davos

Chandrababu Davos Tour: ఏపీలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఇన్వెస్ట్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొని పారిశ్రామికవేత్తలతో బృందం భేటీ అవుతుంది. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే, దావోస్ లోని బెల్వేడార్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర బృందం సభ్యులు భేటీ అయ్యారు.

లక్ష్మీమిట్టల్ తో భేటీ సందర్భంగా.. భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. భావనపాడు – మూలపేట ప్రాంతం తయారీ, ఆర్అండ్ డీ, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని లక్ష్మీమిత్తల్ కు వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.

లక్ష్మీ మిట్టల్ తో భేటీ అనంతరం మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. లక్ష్మీమిట్టల్ తో చంద్రబాబు, లోకేశ్, ఇతర బృందం సభ్యులు ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘‘భావనపాడులో పెట్రో కెమికల్ హబ్, భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరాను. ఏపీ ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపాను. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన లక్ష్మీ మిట్టల్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాను. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై లక్ష్మీమిట్టల్ సానుకూలంగా స్పందించారు.’’ అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.

లక్ష్మీ మిట్టల్ తో భేటీ అయిన విషయాన్ని చంద్రబాబు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘ఈరోజు దావోస్ లో లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్ తో భేటీ అయ్యాం. ఆర్సెలార్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ ఇటీవల అనకాపల్లిలో 17.8 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ కోసం రూ.1.4లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని వివరించినట్లు ముఖ్యమంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందంకు సోమవారం స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. జ్యూరిచ్ లో స్విస్ తెలుగు డయాస్పోరా నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఐరోపాలోని 12దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు హాజరయ్యారు. జన్మభూమి అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని వారిని చంద్రబాబు కోరారు.

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ పలు కంపెనీల ప్రతినిధులో భేటీ అవుతుంది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పారిశ్రామిక వేత్తలతో వరుసగా చంద్రబాబు, లోకేశ్ భేటీ అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెబుతూనే.. ప్రభుత్వం అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు.