చంద్రబాబులో ఊహించని మార్పు.. ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానం పవన్ కల్యాణ్‌దే..!

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కల్యాణ్‌ ఇచ్చిన మద్దతు ఏపీ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.

Deputy Cm Pawan Kalyan : జాతీయ స్థాయిలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందిన సీఎం చంద్రబాబుపై రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం ఉంది. తన నీడను కూడా చంద్రబాబు నమ్మరని భావిస్తుంటారు. అది నిజమా కాదా.. అన్నది పక్కనపెడితే…. ఏపీలో ప్రస్తుత రాజకీయాలు గమనిస్తే… చంద్రబాబు తన నీడకన్నా పవన్‌ కల్యాణ్‌నే ఎక్కువ నమ్మారన్న అభిప్రాయం కలుగుతుంది. సీఎం చంద్రబాబు, పవన్‌కు అమిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో తన ఫొటోతో పాటు పవన్ ఫొటో కూడా ఉంచాలని చంద్రబాబు ఆదేశించారంటే…. పవన్‌కు ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్ధమవుతుంది. అలాగే పవన్ సైతం చంద్రబాబు అంటే తొలి నుంచీ ఎంతో గౌరవంతో ఉన్నారు.

ప్రభుత్వంలో నంబర్ 2 స్థానం పవన్‌దే..
ఎన్నికల ఫలితాలు వెలువడుతూ కూటమి ఘనవిజయం ఖాయం కాగానే.. చంద్రబాబు స్వయంగా జనసేన కార్యాలయానికి వెళ్లి… పవన్‌ను అభినందించారు. పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబు ఎంత ఆత్మీయంగా భావిస్తున్నారనే దానికి ఇదో ఉదాహరణ. ఆ ఒక్క సందర్భంలోనే కాదు…ఇద్దరు నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు. చంద్రబాబు పవన్‌పై పూర్తిస్థాయి నమ్మకముంచారు. ప్రభుత్వంలో పెద్దపీట వేశారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు అప్పగించి.. ప్రభుత్వంలో నంబర్ 2 స్థానం పవన్‌దే అని స్పష్టం చేశారు.

చంద్రబాబు అంటే గౌరవం, మర్యాద..
చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కల్యాణ్‌ ఇచ్చిన మద్దతు ఏపీ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చిందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట పొత్తు ప్రకటన చేయడం ద్వారా నైరాశ్యం నిండిన తెలుగు దేశం శ్రేణులను ఉత్తేజపరిచారు. అప్పుడే కాదు అంతకుముందూ పవన్ చంద్రబాబు అంటే ఎంతో గౌరవంగా ఉంటారు. 2019 ఎన్నికల నాటి విభేదాలు తప్ప జనసేనాని రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం చంద్రబాబుతో సయోధ్యగానే సాగింది.

టీడీపీ అభిమానులను కంటతడి పెట్టించిన పవన్ మాటలు..
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి తొలి సమావేశంలోనూ పవన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. ఆయన నలిగిపోయారంటూ పవన్ అన్న మాటలు టీడీపీ అభిమానులను కంటతడి పెట్టించాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఇద్దరు నేతలు పరస్పరం అభినందించుకున్నారు. పవన్‌ వల్లే బీజేపీతో పొత్తు, కూటమి అసాధారణ గెలుపు సాధ్యమయ్యాయని చంద్రబాబు ఉద్దేశం. ఆ విషయాన్ని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.

పవన్ కు విపరీతమైన ప్రజాదరణ..
రాష్ట్ర ప్రజలు చంద్రబాబులానే పవన్‌పైనా ఎంతో ఆదరణ చూపుతున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారి అమరావతికి వచ్చిన జనసేనానికి రాజధాని రైతులు పూల వర్షం కురిపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పవన్‌ను నాయకుడిగా అంగీకరిస్తున్నారు. మొత్తంగా టీడీపీ, జనసేన మధ్య ఉన్న స్నేహం, చంద్రబాబు, పవన్ మధ్య పెరగుతున్న అనుబంధం…. రాష్ట్ర రాజకీయాల్లో సానుకూల, ఆహ్లాదరకర వాతావరణాన్ని ఏర్పరిచాయి.

Also Read : దటీజ్ పవన్ కల్యాణ్.. దారుణ ఓటమిని విజయంగా మార్చుకున్న జనసేనాని

ట్రెండింగ్ వార్తలు