Annadatha Sukhibhava: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలుపై ఫోకస్ పెట్టింది. మరి అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలవుతుంది, తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ స్కీమ్ అమలు గురించి మరో అప్‍డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే వివరాలను టీడీపీ మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. జూన్ 12న ఈ పథకం అమలు చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.20వేలు జమ చేస్తామన్నారు.
తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.20 వేలు (మూడు విడతల్లో) అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో రైతు భరోసా కింద రూ.13500 ఇవ్వగా.. తాము రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6వేలు అందిస్తుండగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14వేలు కలిపి ఏడాదికి రూ.20వేలు అందిస్తామని వెల్లడించింది.
ఈ సాయం రైతులకు ఆర్థిక ఊతం ఇస్తుందన్నారు చంద్రబాబు. అంతేకాదు వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, సహజ విపత్తుల నష్ట పరిహారం వంటి అవసరాలను తీరుస్తుందన్నారు. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.6,300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చన్నారు. అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందని చెప్పారు.
పీఎం కిసాన్ స్కీమ్ లో అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తోంది కేంద్రం. పీఎం కిసాన్ నిధులతో కలిపి రూ.20 వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో రైతుభరోసా స్కీమ్ ఉండేది. ఇందులో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం చేసేది. పీఎం కిసాన్ కింద కేంద్రం ఏటా అందించే రూ.6 వేలకు మరో రూ.7,500 కలిపి ఏటా రూ.13,500 ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం మొత్తాన్ని రూ.20 వేలకు పెంచుతామని చంద్రబాబు నాడు హామీ ఇచ్చారు.
Also Read: టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టులు ఎవరు? ఖబర్దార్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి..