Cm Chandrababu : స్వర్ణాంధ్ర 2047 దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సమస్త రంగాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోంది. శాఖల మధ్య మరింత సమన్వయం తీసుకొచ్చేలా, విధ్వంసమైనటు వంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టేలా ఏపీ సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పాలనతో పాటు అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం చేశారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ కు 10 సూత్రాల ఆధారంగా పని చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకు ప్రణాళికలు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. జీఎస్ డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలన్నారు. వచ్చే ఏడాదికి 15శాతం ప్లస్ జీఎస్ డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు చంద్రబాబు.
గత ఐదేళ్ల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్ నిర్మిస్తామని అన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమం అందేలా చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి వ్యక్తి వరకు చేరేలా పని చేయాలన్నారు.
Also Read : ఏపీలో ఉగాది నుంచి కొత్త పథకం.. ఏంటీ P4, ఎవరికి ప్రయోజనం, లక్ష్యం ఏంటి..
ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందన్న నమ్మకం కలిగించే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా స్థాయిలో అమలు చేయాల్సిన ప్రణాళికపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది ఏం చెయ్యాలి.. 2029 నాటికి ఏయే లక్ష్యాలను సాధించాలి అనే అంశాలపై స్పష్టతనిచ్చారు సీఎం చంద్రబాబు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అటు ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు చంద్రబాబు. త్వరలోనే మెగా డీఎస్సీ వేయనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పకడ్బందీగా డీఎస్సీని నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. జూన్ లో పాఠాశాలల ప్రారంభం నాటికే పోస్టింగ్ లు ఇవ్వాలన్నారు. మెగా డీఎస్సీలో 16వేల 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.
వారి ఖాతాల్లోకి రూ.15వేలు..
ఇక తల్లికి వందనం పథకంపై ఈ సమావేశంలో కీలక ప్రకటన చేశారు చంద్రబాబు. మే నెలలో తల్లికి వందనం స్కీమ్ ప్రారంభిస్తామన్నారు. రూ.15వేల చొప్పున ఇంట్లో చదువుకునే బడి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే లోగా ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు చంద్రబాబు. రాజధాని అమరావతి ప్రాజెక్ట్ ను 2027లోగా పూర్తి చేస్తామన్నారు.