Amaravati: పార్లమెంట్‌లో త్వరలోనే రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం- సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశమూ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

Amaravati: పార్లమెంటులో త్వరలోనే రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాజధాని రైతుల పెండింగ్ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ లో చట్టం చేయాలని రైతులు చంద్రబాబును కోరారు.

2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం కుదరలేదని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడా సమస్య లేదు కాబట్టి అమరావతికి చట్టబద్ధత త్వరలోనే లభిస్తుందన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు రైతులను సాదరంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సభా వేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబసభ్యులతో ప్రతీ ఒక్కరూ రావాలని ఆహ్వానించారు. రాజధాని రైతులకు అండ, భరోసా కల్పించేందుకే తానూ ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు.

Also Read : 42 నియోజకవర్గాల్లో త్వరలో ఇండస్ట్రియల్ పార్కులు.. ఇక అన్ స్టాపబుల్ గా అమరావతి అభివృద్ధి : సీఎం చంద్రబాబు

రైతులకు వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు రైతులు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరుగుతున్న భూ సమీకరణ అంశమూ ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ విషయంలో రైతులకున్న అనుమానాలు చంద్రబాబు నివృత్తి చేశారు. హైదరాబాద్ మహానగరం తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే నగరం విశాలంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. నగరానికి పెట్టుబడులు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే మేలు రైతులకు వివరించారాయన. చంద్రబాబు వివరణ పట్ల సంతృప్తి చెందామని రైతులు తెలిపారు.