Chandrababu Met Pawan: పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ.. ముంబయి వెళ్లి కలిసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబయి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Chandrababu Met Pawan)ను పరామర్శించారు.
- V Santhosh Kumar
- Updated on- July 12, 2026 / 09:43 PM IST
CM Chandrababu met Pawan Kalyan in Mumbai following surgery
- ముంబయిలో పవన్ పరామర్శ
- కుడి భుజానికి శస్త్రచికిత్స
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Chandrababu Met Pawan: కుడి భుజానికి రొటేటర్ కఫ్ (భుజం కండరాల సమూహం) ఆపరేషన్ చేయించుకుని ముంబైలో కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Chandrababu Met Pawan)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్‌లతో కలిసి వెళ్లిన సీఎం, పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ వేగంగా రికవరీ అవుతున్నారని, అయితే వైద్యుల సూచన ప్రకారం మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. పవన్ రెండో భుజానికి కూడా చిన్న సమస్య ఉందని, దానికి ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ద్వారా నయం చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ:
వియత్నాం బోటు ప్రమాద ఘటనపై ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తోందని సీఎం స్పష్టం చేశారు. పర్యాటకానికి వెళ్లిన వారు ప్రమాదానికి గురికావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిన పర్యాటకులను కూడా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు.
ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు:
ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మోదీ భారతదేశానికి గర్వకారణమని, ఆయన నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా దేశ కీర్తిప్రతిష్టలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయని కొనియాడారు. “రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోదీ” అంటూ అభివర్ణించారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం మోదీ చేస్తున్న కృషి ఖచ్చితంగా ఫలిస్తుందని, ఆయన నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు.
