CM Chandrababu Naidu
CM Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం. అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ అని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన మంగళగిరిలో ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నేటితరం చాలామంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అన్నవాళ్ల పనైపోయింది. కానీ, పార్టీ శాశ్వతంగా ఉంటుంది. పార్టీ వారసులుగా భవిష్యత్తు తరాలకు ఆ ఫలాలు అందించే బాధ్యత మనదని చంద్రబాబు అన్నారు.
Also Read: Kethireddy Venkatarami Reddy: వైఎస్ షర్మిళ, విజయమ్మపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం ముందు తెలుగుదేశం తరువాత అన్నట్లుగా తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం. యువతను ప్రోత్సహిస్తూ.. పదవులు, అధికారాలు సామాన్యులకు, చదువుకున్న వారికి, అన్నివర్గాలకు అందించిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు దేశంలోనే తొలిసారి ప్రమాద బీమా ప్రవేశపెట్టిన పార్టీ టీడీపీనే. ఈ వినూత్న ఆలోచనకు లోకేశ్ శ్రీకారం చుట్టి ఎంతో పటిష్టం చేస్తూ వచ్చారు. శాశ్వత సభ్యత్వం తీసుకునేందుకు వచ్చే రూ.లక్ష కూడా కార్యకర్తల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని చంద్రబాబు చెప్పారు.
చనిపోయిన కార్యకర్తల పిల్లలు చాలా మందికి ఎలిమెంట్రీ స్కూల్ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తున్నాం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్ఠ యంత్రాంగం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ భావంతో ముందుకెళ్తు ప్రతిభకు పెద్దపీట వేస్తాం. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పోషించిన కీలక పాత్రలు మరే పార్టీకి సాధ్యం కాలేదని చంద్రబాబు అన్నారు.