అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..

సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.

Cm Chandrababu On Atchutapuram SEZ Incident (Photo Credit : Google)

Atchutapuram SEZ Incident : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గాయపడ్డ వారికి అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అచ్యుతాపురం ప్రమాదంపై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి, బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు సీఎం చంద్రబాబు.

ఇప్పటివరకు 18 మంది చనిపోయారని, కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సీఎంకి వివరించారు అధికారులు. ప్రమాదానికి కారణాలు ఏంటనే దానిపై ప్రాధమిక సమాచారాన్ని సీఎంకు అందించారు అధికారులు. ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని అధికారులు తెలిపారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. ఈ దుర్ఘటనలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదన్నారు చంద్రబాబు.

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో 18 మంది మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారాయన. ఈ ఘటనపై అధికారులతో చర్చించారు పవన్ కల్యాణ్. సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ఫార్మా కంపెనీలో ప్రమాదంపై అధికారులతో చర్చించారు పవన్ కల్యాణ్. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారాయన.

ముఖ్యంగా ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్, ఫైర్, కేంద్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా? అంతా సక్రమంగానే ఉన్నాయా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీశారు. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు. ఈ యజమానులు ఇద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలియచేశారు.

రియాక్టర్ పేలి ఈ ప్రమాదం సంభవించిందని బయటకి ప్రచారం జరుగుతున్నా సాల్వెంట్ ఆయిల్ ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాద ప్రాంతానికి స్వయంగా వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేసినా సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనతో ఆ యోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు. భారీ స్థాయిలో ప్రమాదం జరగడం 18 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.

అనకాపల్లి జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ మాట్లాడారు. ఒకే ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాద ఘటనలు జరుగుతుండటంతో సేఫ్టీ ఆడిట్‌ ప్రాముఖ్యతపై అధికారులకు సూచనలు చేశారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, కార్మిక శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి సేఫ్టీ ఆడిట్ చేపట్టి భద్రత ప్రమాణాలు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు.

Also Read : ఎన్నికలకు ముందు ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క.. పిఠాపురంపై మెగా హీరోల ఫోకస్, ఏం చేయబోతున్నారంటే..

ట్రెండింగ్ వార్తలు