తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Cm Chandrababu (Photo Credit : Google)

Ttd Laddu Row : తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వేసిన సిట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చంద్రబాబు. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ అంటూ ట్వీట్ చేశారాయన. తిరుమల లడ్డూ వివాదంలో స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తిరుమల క్షేత్రాన్ని, స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని జగన్ ప్రభుత్వంలో అపవిత్రం చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వైసీపీ కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు తన రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం దారుణం అన్నారు. లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని ఎదురుదాడికి దిగారు.

చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ కేసు విచారణ సమయంలో కోర్టు కొంత సీరియస్ కామెంట్స్ కూడా చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేయాలంది. అందులో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించింది.

Also Read : నటి జెత్వానీ కేసు.. ఆ ఐపీఎస్ ఆఫీసర్లకు కొత్త గుబులు..!