Cm Chandrababu: అనంతపురంలో జరిగిన కూటమి పార్టీల బహిరంగ సభలో వైసీపీ చీఫ్ జగన్ పై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు. వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి అని అన్నారు. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి దగ్గరికి వెళితే ధృతరాష్ట్ర కౌగిలికి బలి అవుతారని హెచ్చరించారు. ఐదేళ్లు ఆ ధృతరాష్ట్ర కౌగిలిలోనే ఉన్నారు, 2024 ఎన్నికల్లో ప్రజలకు విముక్తి కలిగిందని చెప్పారు.
తెలుగుదేశం ఆవిర్భావంతో సీమ ప్రజల జీవితాల్లో మార్పు మొదలైందన్నారు చంద్రబాబు. సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులకు నాడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారాయన. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు తెలుగుదేశం హయాంలో వచ్చినవే అన్నారు. సీమ పల్లెల్లో ఫ్యాక్షనిజం అంతం చేసినా.. నీళ్లు తెచ్చినా ఆ ఘనత మనదే అన్నారు చంద్రబాబు.
ఈ ఏడాది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైనా అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయని చెప్పారు. మీకు గుర్తుందా సీమ రాజకీయం మారుతోందని మొన్న ఎన్నికల సభల్లో గట్టిగా చెప్పాను అని చంద్రబాబు అన్నారు. సీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉంటే 45 చోట్ల కూటమిని గెలిపించి నా నమ్మకాన్ని నిజం చేశారని చంద్రబాబు అన్నారు.
‘భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. 15 నెలల పాలనతో సీమలో కూటమి మరింత బలపడింది. ఒకప్పుడు అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేవి. డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. అనంతను దేశంలో బ్రాండ్ చేశాం. నేడు మళ్లీ సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ అమలు చేస్తున్నాం. రూ.3850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకువెళ్లాం” అని చంద్రబాబు అన్నారు.
”అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని.. సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారు. సిద్ధం సిద్ధం అని ఎగిరిపడిన వాళ్లను, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే.. కిక్కురుమనడం లేదు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలే.
ప్రజలంతా ఆ నాయకుడికి క్లాస్ తీసుకోవాలి. ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీకి వెళ్లాలని ప్రజలంతా చెప్పాలి. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హులా..? శాసనసభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారు. వీళ్ల తీరు మారలేదు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోం. ఇక్కడ ఉంది సీబీఎన్, పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి తప్పించుకోలేరు. పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికల్లో ప్రజలే వాళ్లకు రప్పా రప్పా అని బెండు తీశారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు తావు లేదు” అని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Also Read: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో వివాదం.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..