Chandrababu (Representative Image (Image Credit To Original Source))
Cm Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని ఉద్దేశించి నదీ గర్భంలో నిర్మాణాలు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ కు నాగరికత తెలిస్తే నదుల గురించి దుష్ప్రచారం చేయరని అన్నారు. సింధు నాగరికత ఎలా వచ్చిందో జగన్ తెలుసుకుంటే మంచిదన్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాలు ఎక్కువ నదీ తీరాల వెంబడి ఉండబట్టే అభివృద్ధి చెందాయని చంద్రబాబు గుర్తు చేశారు. లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలూ నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు.
నదీ గర్భానికి నదీ పరివాహక ప్రాంతానికి తేడా కూడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు బుద్ధి చెప్పినా రాజధానిపై విషం చిమ్మటం మానడం లేదన్నారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో నీటి కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టే రాయలసీమలో హార్టీకల్చర్ అభివృద్ది చెందిందన్నారు. దేశంలోనే ఉద్యానవన రంగంలో మొదటి స్థానంలో ఉన్న మనం.. రానున్న పదేళ్లలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ.. నదీ గర్భంలో నిర్మాణాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏపీ రాజకీయాల్లో హీట్ ని పెంచాయి. జగన్ కామెంట్స్ పై అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. జగన్ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలు ఎన్నో నదీ ఒడ్డున ఉన్నాయనే విషయం జగన్ తెలుసుకోవాలని సూచించారు. నదీ గర్భంలో అమరావతి అని జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. రివర్ బెడ్‌కి రివర్ బేసిన్‌కు జగన్ తేడా తెలుసుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతి నిర్మాణం చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.
Also Read: మళ్లీ అదే రచ్చ.. అసలు అమరావతిపై వైసీపీ స్టాండ్ ఏంటి? ఏపీ రాజధానిపై ఈ చర్చ ఆగేదెప్పుడు?
”నీటి విషయంలో గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలే. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండేలా చూడటం తప్పెలా అవుతుంది? మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షింగా ఉంటాయి. రాయలసీమకు నీరు అందించాము అనటానికి పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణ. పట్టిసీమ ద్వారా రాయలసీమ పట్ల మాకున్న చిత్తశుద్ధిని చాటుకున్నాం. ఆ ప్రాజెక్ట్ ఫలితంగానే ఉద్యాన రంగం అభివృద్ధి చెందింది. పూర్తి చేయకుండా 2020లోనే నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్ తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం మట్టి పనులు చేసి 900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. నీటి విషయంలో రాజీపడేది లేదు.
కాళేశ్వరంకు లేని అభ్యంతరం నల్లమల్ల సాగర్ కు ఎందుకు? తెలుగు ప్రజల కోసం ఒకరికొకరం సహకరించుకుంటాం. ప్రజల కోసం ప్రాజెక్టులు చేపడతాం. కానీ జగన్ కోసం నేనెందుకు చేస్తా? నీటిని లిఫ్ట్ చేస్తే ఎక్కడైనా భద్రపరుచుకోవచ్చు, అవసరాల కోసం వాడుకోవచ్చు. మిగులు జలాలతో చేపట్టే నల్లమల్ల సాగర్ మనం చేపడితే.. శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో నీటి లభ్యత పెరుగుతుంది. ఆ నీటిని తెలంగాణ కూడా వాడుకోవచ్చు” అని చంద్రబాబు అన్నారు.