Ap Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది. కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దాదాపు 23వేల మంది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పదవుల పంపకాలపైన పవన్ కల్యాణ్, పురంధేశ్వరితో సీఎం చంద్రబాబు చర్చించారు. దశలవారిగా పోస్టులను ప్రకటించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎన్నికల్లో సీటు దక్కని టీడీపీ సీనియర్లకు కీలక పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది.
పదవుల్లో మూడు పార్టీల నేతలకు సమ ప్రాధాన్యం..
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి నేతలు ఒక ఒప్పందానికి వచ్చారు. తొలి దశ పోస్టుల ప్రకటన కసరత్తు దాదాపు పూర్తైంది. మూడు పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. టీడీపీలో సీనియర్లతో పాటు జనసేన, బీజేపీ ముఖ్య నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది.
ఆలపాటికి అమరావతికి సంబంధించిన కీలక బాధ్యతలు..
బీజేపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడ్డ నేతలకు ఈ విడతలోనే అవకాశం దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఖాయమైనట్లు సమాచారం. దేవినేని ఉమకు ఆర్టీసీ ఛైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ ఛైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిలారి శ్రవణ్ కు ఎస్టీ కమిషన్ పోస్టులు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు ఖరారు క్రమంలో అవకాశం కోల్పోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
మీడియా సంస్థల అధినేతకు టీటీడీ ఛైర్మన్ పదవి..?
రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి ఛైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి కాకుండా.. విడతల వారిగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 30శాతం పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నారు. ఇక టీటీడీ బోర్డు ఏర్పాటుపై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. మీడియా సంస్థల అధినేతకు టీటీడీ ఛైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటుగా మరో 3 రాష్ట్రాలకు చెందిన వారికి బోర్డులో అవకాశం కల్పించనున్నారు.
Also Read : చంద్రబాబు ప్రభుత్వం వెరైటీ శిక్ష.. ఆ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లలో కలవరం..