విజయవాడ ముంపు ప్రాంతాల్లో బోటుపై సీఎం చంద్రబాబు పర్యటన.. ఆదుకుంటామని బాధితులకు హామీ

బాధితులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Vijayawada Floods : విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, ఇతర వదర ప్రభావిత ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. వరద నీరు తగ్గేవరకు పరిస్థితిని పర్యవేక్షిస్తామని, బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రికి తరలిస్తామని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రజలకు దగ్గరలోనే ఉంటామని భరోసా ఇచ్చారు.

అటు సింగ్ నగర్ గండి పూడ్చడంపై చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. బాధితులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

బుడమేరు వాగు పొంగడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాశ్ నగర్, పాయకాపురం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

నేను ఇక్కడే ఉంటా- సీఎం చంద్రబాబు
”విజయవాడలో పరిస్థితులు చూశాక చాలా బాధేస్తోంది. కొన్ని వేల మంది లోపల ఉన్నారు. ప్రజలు దీనావస్థలో ఉన్నారు. తాగునీరు కూడా లేవు. ఇవన్నీ చూశాక నేను ఇక్కడే ఉంటాను. రాత్రి కూడా ఇక్కడే ఉంటాను. అందరికీ న్యాయం జరిగే వరకు, అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను అండగా ఉంటాను. బాధితులను కాపాడతాం. ఇళ్లపై ఉన్న వారికి, అందరికీ భరోసా ఇస్తున్నా. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాను. పూర్తిగా వాళ్లను అన్ని విధాలుగా రక్షించే వరకు ఇక్కడే ఉంటాను. బోట్లు పెడతాం. బాధితులకు కావాల్సిన నిత్యవసర సరకులు, తాగునీరు అందిస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

 

లక్షా 50వేల మందికి ఆహారం..
విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. లక్ష 50వేల మందికి అక్షయ పాత్ర ద్వారా సరిపడ ఆహారాన్ని సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో మంగళగిరిలోని అక్షయ పాత్ర క్యాంటీన్ లో లక్ష 50వేల మందికి సరిపడ భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని విజయవాడలోని వరద బాధితులకు అందించనున్నారు. ఖర్చు గురించి ఆలోచన చేయొద్దని, అన్ని దుకాణాల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలని సీఎం చంద్రబాబు అధికారులు ఇప్పటికే ఆదేశించారు.

 

ట్రెండింగ్ వార్తలు