విశాఖలో అడుగుపెట్టనివ్వను, స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ హామీ

cm jagan assurance to protect visakha steel plant: విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ సీఎం జగన్ ను కలిసింది. సుమారు గంటపాటు వారు సీఎంతో సమావేశం అయ్యారు. సీఎం జగన్‌ను కలిసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని కమిటీ తెలిపింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగబోదని సీఎం హామీ ఇచ్చారని కమిటీ నేతలు తెలిపారు.

దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అడుగు పెట్టనివ్వని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. పోస్కో పరిశ్రమను భావనాపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని కార్మిక సంఘం తెలిపింది. సీఎం జగన్‌ మాటపై తమకు నమ్మకం ఉందన్న కార్మిక సంఘం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంపై కార్మిక సంఘాల నుంచి సీఎం జగన్ వివరాలు తీసుకున్నారు. అనంతరం తాను ఇప్పటికే ఈ అంశంపై ప్రధానికి లేఖ రాయడంతో పాటు కేంద్రంతో జరుపుతున్న సంప్రదింపులను వారికి వివరించారు. ప్రైవేటీకరణ ఆపేవరకూ పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాలు సీఎం జగన్‌కు తెలిపాయి.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్రం తీసుకున్న స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి.

విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్ పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ సీఎం జగన్ కి స్వాగతం పలికారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమం రాజశ్యామల యాగంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. సంప్రదాయ వస్త్రధారణలో రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.