Cm Jagan
CM Jagan : స్కూళ్లు, అంగన్ వాడీ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ అభయం ఇచ్చారు. పాఠశాలలు, అంగన్‌వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదన్నారు. అంతేకాదు ఒక్క కేంద్రాన్ని కూడా మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు సీఎం జగన్.
విద్యాశాఖ, నూతన విద్యా విధానం, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులు, ప్రస్తుత, భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
నూతన విద్యా విధానంలో భాగంగా మండలానికి ఒకట్రెండు జూనియర్ కళాశాలలు ఉండేలా చూడాలని.. ఆట స్థలం లేని పాఠశాలలకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి క్రీడా దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు.
రాష్ట్రంలో రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. పీపీ-1లో 1, 2 తరగతులకు కిలోమీటర్ లోపు పాఠశాల ఉండాలన్నారు. పీపీ-2లో 3-10 తరగతులకు 3 కిలోమీటర్లలోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఒకే టీచర్ అన్ని పాఠ్యాంశాలు బోధించే విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. జులై 1 నుంచి రెండో దశ నాడు-నేడు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల తేదీలపై సీఎం దగ్గర ఎలాంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. పరీక్షలకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరీక్షలపై మొదటి నుంచి తమ వైఖరి ఒక్కటే అని వివరించారు.