రాజధాని మంటలు : సీఎం జగన్ రాజీనామా చేయాలి

  • Publish Date - December 21, 2019 / 12:54 AM IST

ఆందోళనలు, ధర్నాలతో అమరావతి అట్టుడుకుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి GN RAO కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే.. ఆందోళనకారులు సచివాలయ ముట్టడికి  యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం జగన్ సహా, ప్రభుత్వ ఫ్లెక్సీలను నిరసనకారులు చింపివేశారు. టైర్లను కాల్చి రోడ్డుపై బైఠాయించారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం సాయంత్రం GN RAO కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీ రిపోర్టులోని అంశాలు బయటకు పొక్కడంతో రాజధాని ప్రాంత రైతులు రోడ్లపైకి పెద్ద సంఖ్యంలో వచ్చి నిరసన కార్యక్రమాలు చేప్టటారు. ప్రభుత్వానికి, జీఎన్‌రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం – మందడం వై జంక్షన్‌ వద్ద రైతులు ధర్నాకు దిగారు. రహదారికి అడ్డంగా జేసీబీ పెట్టి… ధర్నా చేయడంతో రాకపోకలు స్తంభించాయి.

ఆ తరువాత సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు రాజధాని ప్రాంత రైతులు ప్రయత్నించారు. సచివాలయం వద్ద బారికేడ్లను దాటేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేజారుతుండడంతో.. సచివాలయం నుంచి జీఎన్‌ రావు  కమిటీని వేరొక మార్గంలో పోలీసులు పంపించివేశారు. జీఎన్‌ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని రైతులు ఆరోపించారు. తమకు తీవ్ర ఆన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

* అమరావతి ముంపు ప్రాంతమని జీఎన్‌రావు ఎలా నిర్ధారిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.  
* ఎవరెవరి వద్ద అభిప్రాయసేకరణ చేశారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
* జీఎన్‌రావు కమిటీ నివేదిక, ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తుళ్లూరులో మహిళలు ఆందోళన చేపట్టారు. 
* రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలు, జగన్ ఫొటోలను నిరసనకారులు ధ్వంసం చేసి తగులబెట్టారు.

మహిళల నిరసనలు : –
అనంతరం రోడ్లు మీద టైర్లు  పడేసి కాల్చారు. తమకు మూడు రాజధానులు వద్దన్న మహిళలు.. అమరావతే రాజధానిగా కావాలన్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే చేయాలి, లేకుంటే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఒక రాజధాని కట్టడానికే డబ్బులు లేనప్పుడు మూడు రాజధానులు ఎలా కడతారని అమరావతి వాసులు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం ప్రాంతీయ విబేధాలు సృష్టించేందుకే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని మండిపడ్డారు.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జాతీయ రహదారిపై  బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 
Read More : ఎవరి వాదన వారిది : GN RAO కమిటీ రిపోర్టు..స్వాగతించిన వైసీపీ, బీజేపీ