AP CM jagan
CM JAGAN : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనం అవుతారు. రేపుకూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు కు నిధులు , ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను జగన్ కోరనున్నారు. ఇదే సందర్భంలో ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైకూడా మోదీ, అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో రెండుమూడు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో జగన్ భేటీ అవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : కొత్త పార్లమెంటులో తొలిసారిగా రాష్ట్రపతి ప్రసంగం
సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా అనేక ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన నిధులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు సంబంధించిన నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హొదాకు సంబంధించిన అంశం.. ఇవన్నీ ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడిఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవల కాలంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు విషయంపై కీలకంగా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోదీ, అమిత్ షా భేటీలో జగన్ ఈ అంశాలపై ప్రధానంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది