మరణం లేని మహానేత వైఎస్ఆర్, తండ్రిని స్మరించుకున్న సీఎం జగన్

  • Publish Date - July 8, 2020 / 09:21 AM IST

ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు (జూలై 8,2020). ఈ సందర్భంగా ఆయనను సీఎం జగన్ స్మరించుకున్నారు. తన తండ్రి మరణం లేని మహానేత అని అన్నారు. రైతు ప‌క్ష‌పాతి అయిన మ‌హానేత జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉందన్నారు జగన్. ఈ మేరకు ట్వీట్ చేశారు. “నాన్న‌గారి 71వ జ‌యంతి నేడు. ఆయ‌న మ‌ర‌ణం లేని మ‌హానేత‌. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవ‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతుల‌కు ఉచిత విద్యుత్‌, జ‌ల‌య‌జ్ఞం.. ఇలా ఎన్నో ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే.. రైతు ప‌క్ష‌పాతి అయిన మ‌హానేత జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది” అంటూ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.


ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్:
వైఎఆర్ జయంతి సందర్భంగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ‘‘రైతు బాంధవుడు వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తండ్రీ, కొడుకులకు ప్రజలంటే అంతులేని ప్రేమ. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్. పేదల పక్షపాతిగా నిలిచిన ఆయన 71వ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఆయన సేవలను మననం చేసుకుందాం.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

వైఎస్ఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి:
దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం(జూలై 8,2020) ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర ఆయన తనయుడు, సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Here>>ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్‌ పెట్టేందుకు వైసీపీ ప్లాన్‌?