CM Jagan review eluru mystery illness : ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై కేంద్ర వైద్య, సాంకేతిక సంస్థల నిపుణులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడానికి గల కారణాలపై ఆరా తీశారు. తాగునీరు కలుషితమైందనడానికి ఆధారాలు లేవని ఢిల్లీ ఎయిమ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఏపీ మున్సిపల్ డిపార్ట్‌మెంట్ అధికారులు సీఎంకు వివరించారు.
మరోవైపు పురుగుల మందుల అవశేషాలే ఈ పరిస్థితికి కారణమని ఎన్ఐఎన్ ప్రాథమిక అంచనా వేసింది. బ్లడ్ శాంపిల్స్‌లో లెడ్, నికెల్ ఉన్నట్లు గుర్తించామని వివరపించారు. ఆర్గోనోక్లోరిన్స్, ఆర్గనో ఫాస్పేట్స్ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇవి ఎలా శరీరాల్లోకి చేరాయన్న దానిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఎయిమ్స్ రిపోర్ట్.. నిపుణులు చెప్పిన విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. తాగునీటిలో ఏ సమస్యాలేదని నివేదికలు చెబుతున్నాయి. ఇదే విషయాని హెల్త్ సెక్రటరీ భాస్కర్.. సీఎం జగన్‌కు వివరించారు. దీంతో.. తాగునీటిని ఒకటికి రెండు సార్లు పరీక్షించాలని జగన్ ఆదేశించారు.
బ్లడ్ శాంపిల్స్‌లో లెడ్, ఆర్గనోక్లోరిన్, ఫాస్పరస్ కనిపిస్తున్నందున.. అది ఎలా వచ్చిందనే విషయాన్ని కచ్చితంగా గుర్తించాలని అధికారులకు సూచించారు. అలాగే.. బియ్యం శాంపుల్స్ కూడా పరీక్షించాలని అధికారులను ఆదేశించారు.