తప్పు ఎవరు చేసినా తప్పే.. వ్యవస్థలో మార్పు రావాలనే పోలీసులపైనా చర్యలు

  • Publish Date - August 25, 2020 / 03:05 PM IST

తప్పు ఎవరు చేసినా తప్పే అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పోలీసులు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితుల మీద దాడులు సహా.. ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని జగన్ అన్నారు. కానీ, గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడా ఉందన్నారు. ఏదైనా తప్పు చేస్తే.. ఎస్ఐ కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదన్నారు. ఇప్పుడు మాత్రం అలా కాదన్నారు. ఎస్ఐ, సీఐ.. ఇలా ఎవరు తప్పు చేసినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకున్నామని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 4 నుంచి 5 చోట్ల ఇలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు అని జగన్ అన్నారు.



ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే ఉపేక్షిస్తామా? అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎంతటివారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందేశాన్ని పోలీసు అధికారులు కింది స్థాయికి తీసుకెళ్లాలన్నారు. కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు.. తదితర స్థాయిలో ఉన్నవారికి ఓరియెంటేషన్‌ నిర్వహించాలన్నారు.

మానవత్వంతో వ్యవహరించాలి:
ప్రజలకున్న హక్కులేంటి? ఎంత వరకు మనం వెళ్లాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన మనం అవగాహన కలిగించాలని జగన్ అన్నారు. గుండు కొట్టించడం లాంటి ఘటనలు ముమ్మాటికీ తప్పే అన్నారు. అలాంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడకూడదన్నారు. కొన్ని కష్టమైనా నేను, హోంమంత్రి, డీజీపీ, అడిషనల్‌ డీజీ కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఎస్పీలు, ఏఎస్పీలు ఈ సందేశాన్ని దిగువస్థాయికి తీసుకెళ్లాలని, తగిన అవగాహన కలిగించాలని, ఇలాంటి ఘటనలు జరక్కూడదని జగన్ స్పష్టం చేశారు.



మన రాష్ట్ర హోంమంత్రి దళితురాలు, మన డీజీపీ ఎస్టీ, మరి మనం ఎందుకు ఇలాంటి పనులు చేయాలి అని జగన్ ప్రశ్నించారు. మనం సమాజంలో దిగువున ఉన్నవారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత మనది అని చెప్పారు. మన వాళ్ల మీద మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటే… అందరికంటే బాధపడేది మనమే అన్నారు. అలాంటి చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పించకూడదన్నారు. పరివర్తన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అక్రమ మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాలను అరికట్టడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు:
* ఎక్కడా తప్పులు జరగకూడదు
* ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేదు
* మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవ్వరూ అతీతులు కారు
* ఇది మనసులో పెట్టుకోండి
* అవినీతికి ఎక్కడా ఆస్కారం ఉండకూడదు
* ఈ రెండు అంశాలనూ దృష్టిలో పెట్టుకోండి
* ఇప్పటివరకూ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారు
* కొన్నిసార్లు చర్యలు తీసుకున్నప్పుడు బాగా బాధవేస్తుంది
* కాని తప్పులు జరిగినప్పుడు కఠినంగానే వ్యవహరిస్తాం
* మళ్లీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదు


ట్రెండింగ్ వార్తలు