YSR Jagananna Saswatha Bhoomi : ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం కృష్ణా జిల్లాలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం జగన్.
అత్యాధునిక సాంకేతికతో :-
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు (Takkellapadu)లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. భూముల రీసర్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా తక్కెళ్లపాడులో పైలాన్‌ను జగన్ ఆవిష్కరిస్తారు. ఇక్కడి నుంచే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకానికి (YSR Jagananna Saswatha Bhoomi) కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. గత వందేళ్ల చరిత్రలో దేశంలో ఎక్కడా తలపెట్టని విధంగా అతిపెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. హైబ్రిడ్ మెథడ్‌లో కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్, డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధిష్ట సమయంలో సర్వేను పూర్తి చేసేందుకు ప్రభుత్వం టైమ్‌లైన్ రూపొందించింది. రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో రీసర్వేకు నిబంధనలను రూపొందించారు.
యజమానులకు హక్కు పత్రాలు :-
రాష్ట్ర వ్యాప్తంగా 17వేల 461 రెవెన్యూ గ్రామాలు, 47వేల 861 ఇళ్లు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించి యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. మొత్తం మూడు దశల్లో సర్వే పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 5వేల122 గ్రామాల్లో, రెండో దశలో 6వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తారు. తదుపరి మూడో దశలో మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు. డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియానే డ్రోన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ సర్వేయర్ల బృందం రాష్ట్రానికి చేరుకుంది.
ఒక్కో గ్రామంలో రీ సర్వే :-
పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే పూర్తి చేసిన తక్కెళ్లపాడులో భూహక్కు దారులకు సీఎం జగన్ స్వయంగా పట్టాలు అందించనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రతి జిల్లాల్లో ఒక్కో గ్రామంలో రీసర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 13 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఆ తరువాత దశలవారీగా మొత్తం సర్వే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రీ సర్వే సందర్భంగా యజమానులు ఎలాంటి రికార్డులు చూపించాల్సిన పని ఉండదని అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారమే సర్వే పూర్తి చేస్తారన్నారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తోంది.