శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్.. ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరయ్యారు.

cm ys jagan in visakha sri sarada peetham

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరయ్యారు. రాజశ్యామల యాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠంలోని దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ.. సీఎం జగన్ తో పూజలు చేయించారు. శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సీఎం జగన్ పాల్గొన్నారు.

అంతకుముందు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన కష్ణదాస్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ వెస్ట్ ఇన్‌చార్జ్ ఆడారి ఆనందకుమార్ స్వాగతం పలికారు. సీఎం హోదాలో నాలుగోసారి శ్రీ శారదా పీఠానికి వచ్చిన జగన్‌ను పీఠాధిపతులు సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చినముషిరివాడ నుంచి శ్రీ శారదా పీఠం వరకు ప్రత్యేక రెయిలింగ్ పెట్టారు.

ఘనంగా వార్షిక మహోత్సవాలు
శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయని, భారత దేశంలో రాజశ్యామల యాగం చేసే ఎకైక పీఠం తమదేనని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ప్రతిఏటా సీఎం జగన్ రావడం పరిపాటని.. ఈ ఏడాది సైతం ముఖ్యమంత్రి వచ్చి రాజశ్యామల యాగం చేసి అమ్మవారి ఆశ్సీస్సులు తీసుకున్నారని చెప్పారు.

Also Read: పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?