YCP MP Mithun Reddy
దర్యాప్తు తుది దశకు చేరుకున్న టైమ్‌లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..పెద్ద రచ్చకే దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన అరెస్టుల, కస్టడీలు, విచారణలు ఒక ఎత్తు. ఇక ఎంపీ మిథున్‌రెడ్డితోనే అయిపోలేదు..పిక్చర్ అబీ బాకీ హై అంటోంది టీడీపీ. ఇప్పటికే సిట్ వేసిన ఛార్జిషీట్‌లో వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించారు. మిథున్ వరకు జరిగిన ముడుపుల వ్యవహారాన్ని క్లియర్ కట్‌గా చెప్పేశారు. దర్యాప్తు పరంగా అదలా కంటిన్యూ అవుతూ ఉండగానే ఇంకో స్కెచ్ వేసింది టీడీపీ.
ఏకంగా లిక్కర్ స్కామ్ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ప్లాన్ చేస్తోంది. అందుకు పార్లమెంట్‌ను వేదికగా చేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్‌లో లిక్కర్ స్కాం వ్యవహారాన్ని ప్రస్తావించారు లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని..మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్కాం జరిగిందని చెప్పుకొచ్చారు.
మద్యం కుంభకోణంలో వైసీపీ పెద్దల ప్రమేయం ఉందని..ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిందని అంటున్నారు టీడీపీ ఎంపీలు. అయితే ఈ విషయంపై చర్చకు కేంద్రప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది కీలకంగా మారింది. ఒకవేళ పార్లమెంట్‌లో చర్చకు అనుమతిస్తే మాత్రం లిక్కర్ ఇష్యూలో వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్‌ను జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు కొంతలో కొంతైనా ఫలించే అవకాశం లేకపోలేదు.
అయితే లిక్కర్ ఇష్యూపై ఆల్ పార్టీ మీటింగ్‌లో ఎంపీ లావు ప్రస్తావించినప్పుడు వైసీపీ ఎంపీలు కూడా ఆ సమావేశంలో ఉన్నారట. వాళ్లు అభ్యంతరం చెప్పినట్టేం బయటకు రాలేదు. దీంతో వైసీపీ కూడా లిక్కర్ కేసుపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కోరుకుంటోందా అన్నది కీలకంగా మారింది. తాము ఏ తప్పూ చేయలేదని చెప్పుకోవడానికి పార్లమెంట్‌ను వాడుకోవాలనేది వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. వైసీపీ కోరుకున్న కోరుకోకపోయిన..టీడీపీ కేంద్రంలో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ చర్చకు పట్టుబడితే మాత్రం..ఏపీలో కాక పుట్టిస్తున్న లిక్కర్ స్కాం ఇష్యూ పార్లమెంట్‌లో ప్రకంపలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.
త్వరలో అతిపెద్ద తిమింగలం బయటికొస్తుందా?
మరోవైపు ఎంపీగా ఉంటూ జగన్‌కు సన్నిహితుడిగా పేరున్న మిథున్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు పీక్స్ చేరుకుందని అంటున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన రాజ్‌కసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లేటెస్ట్‌గా మిథున్రెడ్డి..వీళ్లందరూ..జగన్‌కు సన్నిహితులుగా, కోటరీగా ప్రచారంలో ఉన్నారు. ఇక మిథున్‌రెడ్డి అరెస్ట్‌తో కేసు అసలు స్టేజ్‌కు వచ్చిందని..త్వరలో అతిపెద్ద తిమింగలం బయటికొస్తుందంటూ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఆయన చెబుతున్న అతి పెద్ద తిమింగళం ఎవరనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి చార్జిషీటుని కేవలం ఇరవై రోజులలో వేసి విచారణ పూర్తి చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఈ ఇరవై రోజుల్లో కీలకమైన మరిన్ని అరెస్టులు జరుగుతాయా అన్న ఉత్కంఠ రేపుతోంది. మిధున్ రెడ్డి అరెస్టుతో జగన్ మీద కూడా సిట్ ఫోకస్ పెట్టిందన్న టాక్ హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే 13ని అరెస్టు చేసిన సిట్ 14వ వ్యక్తిగా ఎవరిని అరెస్టు చేస్తుందోనని వైసీపీలో ఆందోళనలో మొదలైందట.
ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన వరుస అరెస్టులు..తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ వరకు వచ్చి ఆగాయని అంటున్నారు టీడీపీ నేతలు. ఈడీ రంగంలోకి దిగబోతుందట. ఈడీ కనుక దిగితే నిందితులకు ఈ కేసు మరింత తలనొప్పిగా మారడం మాత్రం పక్కా. అయితే వైసీపీ పెద్దల అరెస్టులు ఉండకపోవచ్చంటున్నారు.
కీలకంగా ప్రచారంలో ఉన్న మరో ఇద్దరి పేర్లను నిందితులుగా చేర్చి విచారణకు పిలువొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే వైసీపీ, జగన్ కేంద్రంగా లిక్కర్ ఇష్యూపై దేశవ్యాప్త చర్చ జరగాలని కూటమి కోరుకుంటోందని అంటున్నారు. అందుకే పార్లమెంట్‌లో డిస్కషన్ జరిగేలా ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రస్తావించారని చెప్తున్నారు. లిక్కర్ కేసులో ఫైనల్ అవుట్ పుట్ ఏంటో..టీడీపీ సాధించాలనుకుంటున్నదేంటో వేచి చూడాలి మరి.