సింహాచలంలో కోల్డ్ వార్ నడుస్తోందా? అసలేం జరుగుతోంది?

  • Publish Date - September 2, 2020 / 09:15 PM IST

సింహాచలం దేవస్థానంలో కోల్డ్ వార్ నడుస్తోందా? ఆలయ బోర్డు ఛైర్మన్ సంచయితకు అధికారులకు పడటం లేదా ? ఆలయ ఈవో భ్రమరాంబ పాత పోస్టుకు బదిలీ చేయించుకోవడానికి కారణం ఏంటి? అసలు నారసింహుడి సన్నిధిలో ఏం జరుగుతోంది…? విశాఖ సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న భ్రమరాంబ తిరిగి తన పూర్వపు స్థానానికి వెళ్లిపోతున్నారు.



ఆమె స్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం కార్య నిర్వాహణాధికారిగా పనిచేస్తున్న త్రినాథరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే కోరి మరీ ఈ ఏడాది జూన్‌ పదిన సింహాచలం ఈఓగా వచ్చిన భ్రమరాంబ… మూడు నెలలు తిరగకముందే తానే బదిలీ కోరుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్‌ సంచయితతో ఈవో భ్రమరాంబకు తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదట్లో అంతా సవ్యంగానే ఉన్నా ఇటీవల ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య పొసగక పోవడంతో భ్రమరాంబ తనను తాను బదిలీ చేయించుకున్నారనే చర్చ జరుగుతోంది.



ఇక ఇటీవల ఓ అనధికార వ్యక్తిని చైర్‌పర్సన్‌ సింహాచలానికి తీసుకువచ్చి గెస్ట్‌హౌస్‌లో పెట్టారు. మూడు నెలలుగా అతను గెస్ట్ హౌజ్‌లోనే ఉన్నాడు. ఆ యువకుడిని గెస్ట్‌హౌజ్‌ నుంచి ఖాళీ చేయించడంతో పాటు… అప్పటివరకు అయిన ఖర్చులు చెల్లించాలని ఈవో ఆదేశించారు. అది చైర్‌పర్సన్‌కు ఆగ్రహం కలిగించినట్టు తెలిసింది.

అలాగే చైర్‌పర్సన్‌ సంచయిత దేవస్థానం ఖర్చు తగ్గించేందుకంటూ వంద మందికి పైగా ఉద్యోగులను తీయించేశారు. ఇది వివాదాస్పదం కావడంతో తిరిగి వాళ్లను ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆలయ ఛైర్ పర్సన్, ఈవోల మధ్య దూరాన్ని మరింత పెంచింది. మరోవైపు సింహాచలం దేవస్థానంలో ఓఎస్‌డీ పోస్టును సృష్టించి, నెలకు 50 వేల జీతం, రవాణా వ్యయం, ఇతర భత్యాలు ఇవ్వాలని ఛైర్‌పర్సన్‌ నిర్ణయించడం వంటి అంశాలు భ్రమరాంబకు మరింత కోపం తెప్పినట్లు తెలుస్తోంది.



అలాగే తనకు కావలసిన మనుషులను కీలకమైన స్థానాల్లో పెట్టుకోవాలని చైర్‌పర్సన్‌ ప్రయత్నిస్తుందంటూ భ్రమరాంబ అసంతృప్తిగా ఉన్నారని ఆలయ వర్గాలు తెలియజేశాయి. ఇక దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న అక్రమాలు, వివాదాల నడుమ గత ఈఓ వెంకటేశ్వరరావు పై మే లో ప్రభుత్వం బదిలీ వేటు వేసి, అప్పటికప్పుడు భ్రమరాంబను ఈవోగా నియమించింది.



అయితే భ్రమరాంబ తీరుపైనా ఎన్నో విమర్శలున్నాయి. అవుట్‌ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని విధుల నుంచి తొలగించే విషయంలో ఇతర సిబ్బందికి బ్రమరాంభకు విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. సింహాచల భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలు కూడా సిబ్బందికి భ్రమరాంబకు మరింత గ్యాప్ పెంచినట్లైంది. మొత్తంగా… దేవాలయంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరడం… పాలకమండలి సభ్యులు, సిబ్బందితో ఈవోకు పడకపోవడంతోనే తనను బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని భ్రమరాంబ కోరినట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.