Controversy Over Mptc Zptc Election Notification
Controversy over MPTC, ZPTC election notification : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరిషత్ ఫైట్ మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై రాజకీయ రగడ షురూ అయింది. ఎలక్షన్ షెడ్యూల్‌పై వైసీపీ.. టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్‌ఈసీ నీలంసాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 8న పోలింగ్, 10న కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. అయితే.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. దీనిపై ఇవాళ అత్యవసరంగా పొలిట్‌బ్యూరో, రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాలను ఏర్పాటు చేసింది. పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాతే.. టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ రానుంది.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ఓటమి భయంతోనే పరిషత్ ఎన్నికలను చూసి టీడీపీ భయపడుతోందంటూ సెటర్లు వేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే వస్తాయని టీడీపీ భయపడుతోందని.. అందుకే టీడీపీ పారిపోతోందని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు టీడీపీ ఎంత దూరంగా ఉంటే.. అంత గౌరవంగా ఉంటుందన్నారు పేర్ని నాని.
మరోవైపు పరిషత్ ఎన్నికల షెడ్యూల్‌ను జనసేన పార్టీ వ్యతిరికస్తోంది. ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీది ఏకపక్ష నిర్ణయమన్న జనసేన.. ఇవాళ జరిగే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశామని.. కోర్టు తీర్పు రాకముందే ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు.