Tirumala Ghee Controversy
Tirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి కొనుగోలు చేసే నెయ్యి విషయంలో వివాదం తలెత్తింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి నిత్య అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి తక్కువ ధరకే ఇస్తే నష్టాలు వస్తున్నాయని కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపించింది. రెండేళ్లుగా గిట్టుబాటు కాక టీటీడీకి నెయ్యి సరఫరా నిలిపివేసినట్లుగా తెలిపింది.
కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చేసిన ఆరోపణలతో దుమారం చేలరేగడంతో నెయ్యి కొనుగోళ్లపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. కనీసం టెండర్ ప్రక్రియలోనూ పాల్గొనని కేఎంఎఫ్ ఆరోపణలపై టీటీడీ స్పందించింది. కర్నాటకకు చెందిన నందిని డెయిరీ చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది.
నాణ్యత విషయంలో రాజీపడేది లేదని టీటీడీ తేల్చి చెప్పింది. నామినేషన్ పద్ధతిలో నెయ్యిని ప్రొక్యూర్ చేసుకునే అవకాశం లేదంది.
శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏడాదికి 5వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్న టీటీడీ.. నెయ్యితో పాటు అన్నీ ఈ-ప్రొక్యూర్ మెంట్ ద్వారానే కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. నెయ్యి నాణ్యతలో రాజీపడకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతోంది. లోయస్ట్ ప్రైస్ ఆఫర్ చేసిన ఎల్ 1 కాంట్రాక్టర్ నుంచి సప్లయ్ జరుగుతోందని తెలిపింది. 20ఏళ్లుగా టీటీడీకి కర్నాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యి సప్లయ్ చేస్తోందన్నది కరెక్ట్ కాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. 2023 మార్చిలో నెయ్యి కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియలోనే కర్నాకట మిల్క్ ఫెడరేషన్ పార్టిసిపేట్ చేయలేదన్నారు. టీటీడీ ప్రభుత్వ సంస్థ అని, నామినేషన్ పద్ధతిలో ఎవరి నుంచి కూడా నేరుగా కొనుగోలు చేసే అవకాశం లేదని చెప్పారు ఈవో ధర్మారెడ్డి.
Also Read..Srikakulam: శ్రీకాకుళంలో టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ సూపర్ ప్లాన్!
తమకు చెందిన నందిని సంస్థ గత 20ఏళ్లుగా తిరుమల లడ్డూ తయారీకి కావాల్సిన నెయ్యిని సరఫరా చేస్తుందన్నారు కేఎంఎఫ్ అధ్యక్షుడు నాయక్. రాష్ట్రానికి గర్వకారణమైన నందిని నెయ్యి ప్రస్తుతం తిరుపతి లడ్డూలో లేదని, తమ భాగస్వామ్యాన్ని తాజాగా టీటీడీ వదులుకుందన్నారు. కర్ణాటకలో పాలకొరత కారణంగా పాల ఉప ఉత్పత్తుల ధరలు పెరిగాయని, అందుకే నందిని నెయ్యి ధర కూడా భారీగా పెరిగిందన్నారు. తిరుపతి లడ్డూ తయారీకి ప్రతి ఆరు నెలలకు 14లక్షల కిలోల నెయ్యిని తగ్గింపు ధరకు సరఫరా చేసినట్లు తెలిపారు. రెండేళ్లుగా గిట్టుబాటు కాక టీటీడీకి నెయ్యి సరఫరా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.
శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం టీటీడీ ఏటా 5వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు 5వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. టీటీడీ.. మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడం, ఒక కమిటీతో పాటు టీటీడీ బోర్డు కమిటీ ఆ తర్వాత పాలకమండలి తీర్మానం పొంది నెయ్యిని కొనుగోలు చేస్తోంది.
నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీపడకుండా పరీక్షించేందుకు అధునాతమైన ల్యాబరేటరినీ కూడా టీటీడీ తిరుమలలో ఏర్పాటు చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటోంది. ఈ మేరకు ప్రతి ఏటా రెండుసార్లు టెండర్లు పిలుస్తోంది. 2023 మార్చిలో 20లక్షల కేజీల నెయ్యి కొనుగోలు కోసం టెండర్లను పిలిచిన టీటీడీ.. ఆరు మంది ట్రేడర్లు పాల్గొంటే అందులో ఇద్దరిని ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రీమియర్ ఎల్-1గా.. ఆల్ఫా కంపెనీ ఎల్ -2గా నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందాయి.
కేజీ నెయ్యి 424 రూపాయలకు టీటీడీకి సప్లయ్ చేసేలా ఒప్పందం కుదర్చుకుంది. 60శాతం నెయ్యిని ఎల్ 1 నుంచి, మరో 37శాతం నెయ్యిని ఎల్-2 నుంచి కొనుగోలు చేస్తున్న టీటీడీ..తిరిగి అక్టోబర్ నెలలో మరో 6 మాసాలకు సరిపడ 20లక్షల కిలోల నెయ్యి కొనుగోలుకు టెండర్లు పిలవనుంది. అయితే, ఇటీవల టెండర్ ప్రక్రియలోనే పాల్గొనని కర్నాటక మిల్క్ ఫెడరేషన్.. టీటీడీకి తక్కువ ధరకే నెయ్యిని సరఫరా చేయాల్సి వస్తుందన్న సాకుని ఎత్తి చూపడంతో వివాదం చెలరేగింది.