ఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు…193 మంది మృతి

  • Publish Date - July 1, 2020 / 08:07 PM IST

ఏపీలో కరోనా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా నమోదైన 657 కొత్త కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటింది. ఏపీలో మొత్తం 15 వేల 252 మందికి వైరస్ సోకగా ప్రస్తుతం 8 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వైరస్ దూకుడు కొనసాగించగా అనంతపురం జిల్లాలను వణికిస్తోంది. ఏపీలో కొత్తగా 657 కేసులు నమోదు కాగా వీటిలో కేవలం అనంతపురం జిల్లాలో 118 మంది ఉన్నారు. కర్నూలులో 90, తూర్పుగోదావరి జిల్లాలో 80, గుంటూరులో 77 మందికి వైరస్ సోకింది. కడపలో 60, కృష్ణాలో 52 మంది వైరస్ బారిన పడ్డారు.

ఇక కర్నూలు జిల్లాలో కరోనా కేసులు 2 వేలు దాటాయి. కడప, పశ్చిమ గోదావరిలో కేసులు వెయ్యి దాటాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు వెయ్యి దాటిన జిల్లాల సంఖ్య 8కి చేరింది. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. ఏపీలో టెస్టులు చేస్తున్న కొద్ది కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు 24 గంట్లలో కరోనాతో ఆరుగురు మరణించారు. కర్నూలులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 193 కు చేరింది.

ఏపీలో మొత్తం 9, 18, 429 శాంపిల్స్ పరీక్షించగా గడిచిన 24 గంటల్లో 28 వేలకు పైగా పరీక్షలు జరిగాయి. ఏపీలో మే 31 నాటికి కేసుల సంఖ్య 3042..కానీ జూన్ లో వైరస్ విశ్వరూపం చూపింది. ఒక్క నెలలోనే 11,553 మంది వైరస్ బారిన పడ్డారు. సగటున రోజుకు 385 మందికి పైగా కరోనా బారిన పడ్డారు.