మాస్కులు, పీపీఈ కిట్లతో కరోనా మెసేజ్ గణపయ్య..శానిటైజర్ తో మూషికం

  • Published By: nagamani ,Published On : August 22, 2020 / 04:22 PM IST
మాస్కులు, పీపీఈ కిట్లతో కరోనా మెసేజ్ గణపయ్య..శానిటైజర్ తో మూషికం

Updated On : October 31, 2020 / 4:20 PM IST

వినాయక చవితి వచ్చిదంటే చాలు వినూత్నమైన వినాయక ప్రతిమలు కనువిందు చేస్తుంటాయి. ఒక్కో ప్రతిమది ఒక్కో రకం స్టైల్. కళ్లు తిప్పుకోనివ్వని అద్భుత కళతో గణనాధులు వెలిగిపోతుంటారు. ఈ కరోనా కాలంలో గణేషుల శోభ కాస్త తగ్గినా చక్కటి మెసేజ్ లనిచ్చే వినాయకులు వెలిసారు. కరోనా డాక్టర్ వేషంలో ఓ డాక్టర్ గణపయ్య సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.



అటువంటి మరో వినూత్న గణపతి విశాఖపట్నం తాటిచెట్లపాలెం ప్రాంతంలో సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మాస్కు లేకుండా తిరిగితే కరోనా నిన్ను ఖతం చేస్తుంది అని సందేశాన్ని వినాయకుడి వెనకాల పలక మీద రాశారు. ‘నిన్ను నువ్వు రక్షించుకోవడమే.. సమాజాన్ని రక్షించడం’ అని చెబుతున్నారు సదరు గణపతి ప్రతిమ నిర్వాహకులు. పూర్తిగా పర్యావరణ హితమైన ఈ మట్టి వినాయకుడు అటు పర్యావరణానికి ఇటు కరోనా కాలంలో ప్రజలకు చక్కటి సందేశాన్నిస్తున్నాడు. మట్టితో తయారు చేసిన ఈ వినాయకుడికి మాస్క్ కూడా పెట్టారు.



ఒక చేతిలో శానిటైజర్.. ఒక చేతిలో మాస్క్.. ఇక ఈయన వాహనం మూషికరాజం కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు శానిటైజర్ పట్టుకుని.. మాస్క్ పెట్టుకుని వచ్చే భక్తులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నాడు. ఈ గణేషుడిని చూసిన వారంతా చక్కటి కరోనా మెసేజ్ ఇచ్చేలా తయారు చేసిన యువకడు హరిప్రసాద్ ను ప్రశంసిస్తున్నారు. విశాఖపట్నం తాటిచెట్లపాలెంలో ఉండే హరిప్రసాద్ కు చిన్నప్పటినుంచీ వినాయక ఉత్సవాలంటే ఎంతో ఉత్సాహం. ఈ కరోనా సమయంలో రిలేటెడ్‌గా ప్రతిమను తయారుచేయాలనుకుని ఈ ప్రతిమను తయారు చేసానని తెలిపాడు. ఇలా రకరకాలుగా ప్రతి సంవత్సరం సమాజానికి సందేశాన్నిచ్చే గణేష్ ప్రతిమల్ని తయారు చేస్తుంటానని హరి ప్రసాద్ తెలిపాడు.