16 మంది ఏపీ హైకోర్టు సిబ్బందికి సోకిన కరోనా

  • Publish Date - July 1, 2020 / 12:50 AM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పని చేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రధాన న్యాయవాది ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టులో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అత్యవసర పిటిషన్లను ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఏపీలో మరో 648 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51మందికి, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 704 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,595కి చేరింది.

గడచిన 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 187కి చేరింది. మంగళవారం మృతి చెందిన ఏడుగురిలో కృష్ణా 3, కర్నూలు 2, గుంటూరు, అనంతపురంలో జిల్లాలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,897 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.