Covid 19 Andhra Pradesh Update 21 954 New Covid Cases Logged In Ap
AP Corona Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. చిగురుటాకులా వణికిపోతున్న ఏపీలో మరోసారి ఒకేరోజు 20వేలకు పైగా కేసులు నమోదై ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో మళ్లీ రికార్డు స్థాయిలో 22వేల వరకు కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి.
గడిచిన 24గంటల్లో 1,10,147 శాంపిల్స్‌ని పరీక్షించగా 21వేల 954మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. కోవిడ్ వల్ల ఇదే సమయంలో విశాఖపట్నం లో పదకొండు మంది, తూర్పు గోదావరి లో తొమ్మిది మంది, విజయనగరంలో తొమ్మిది మంది, అనంతపూర్‌లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఆరుగురు, చిత్తూర్‌లో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కర్నూల్‌లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు మరియు నెల్లూరులో ఇద్దరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 10,141 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1,70,60,446 శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగింది. ఇప్పటి వరకు కరోనాతో 8,446 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షన్నరకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టి.. 12గంటల వరకు మాత్రమే కఠినంగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వాహనాలను అడ్డుకొని వెనెక్కి పంపిస్తున్నారు. జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులకు తప్పనిసరిగా పడకలు కేటాయించాలని.. ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50శాతం బెడ్లు కరోనా బాధితులకు కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. ఎంతమంది బాధితులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు.
Ap Corona