Cyclone Asani Effect Golden Chariot Flown To Reach Sunnapalli Coast In Srikakulam
Cyclone Asani Effect : బంగాళాఖాతంలో అసని తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. తీరప్రాంతాలన్నీ అలజడిగా మారాయి. పలుచోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. సముద్రతీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అసని తుపాను ప్రభావానికి తీరప్రాంతమంతా అలజడిగా మారింది. తుపాను కారణంగా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు ఓ వింత రథం కొట్టుకొచ్చింది. అది చూడటానికి బంగారు వర్ణంతో తళతళమని మెరిసిపోతోంది. సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన ఆ రథం విదేశానికి చెందినగా భావిస్తున్నారు.
ఈ వింతైన రథాన్ని చూసేందుకు అక్కడి ప్రాంతవాసులు భారీగా తరలివస్తున్నారు. కొట్టుకువచ్చిన వింతైన ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని మత్స్యకారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నో పెను తుపానులు వచ్చాయని, ఎప్పుడూ కూడా ఇలాంటి రథం వంటి వింతైనవి కొట్టుకురాలేదంటున్నారు. ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఈ బంగారు రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ రథం ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనేది తెలియాల్సి ఉంది.
Cyclone Asani Effect Golden Chariot Flown To Reach Sunnapalli Coast In Srikakulam
మరోవైపు.. అసని తుపాను తీవ్ర తుఫానుగా బలహీనపడింది. వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కి.మీ, కాకినాడకు 180 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ, గోపాలపూర్ 550 కి.మీ, పూరీకి 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది.
Read Also : Cyclone Asani : ‘అసని‘ తుపాను ఎఫెక్ట్.. పలు విమాన సర్వీసులు రద్దు..!