Cyclone Ditwah : దూసుకొస్తున్న ‘దిత్వాహ్’ తుపాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడ్రోజులు జాగ్రత్త..
Cyclone Ditwah : ‘దిత్వాహ్’ తుపాను శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను భారత్ వైపు మళ్లింది..
- Harishth Thanniru
- Published On : November 29, 2025 / 07:25 AM IST
Cyclone Ditwah
Cyclone Ditwah : ఏపీని వర్షాలు వీడడం లేదు.. ఈనెల ప్రారంభంలో మొంథా తుపాను హడలెత్తించగా.. ఇప్పడు ‘దిత్వాహ్’ తుపాను రాష్ట్రంవైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం ‘దిత్వాహ్’ శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో అక్కడ వివిధ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను భారత్ వైపు మళ్లింది.. భారత వాతావరణ విభాగం (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంలో వెళ్తుందని, తరువాత తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీనపడొచ్చునని అంచనా వేస్తుంది.
నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను కొనసాగుతుంది. భారతదేశంలోని కార్తెకల్‌కు 220 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 330, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గడిచిన ఆరు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలింది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ 30వ తేదీ తెల్లవారుజాములోగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా (ఏపీ) తీరాలను సమీపించే అవకాశముంది. రేపు రాత్రి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంగా వెళ్తుందని, తర్వాత తీరం వెంబడి ప్రయాణించి, సముద్రంలోనే బలహీనపడొచ్చని అంచనా వేసింది.
Also Read: Kurnool Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు..
శాటిలైట్ లైవ్ అంచనా ప్రకారం.. ‘దిత్వాహ్’ తుపాను ప్రస్తుతం శ్రీలంక భూ ప్రాంతం నుంచి తిరిగి నైరుతీ బంగాళాఖాతంలోకి వచ్చేసింది. సముద్రంలోకి తుపాను వచ్చిందంటే వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం తుపాను ఉత్తరం వైపుగా దూసుకొస్తుంది.. ఇది శనివారం రాత్రి 11.30గంటల సమయంలో చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఆదివారం ఉదయం 11.30 గంటలకు చెన్నైకి 126కిలో మీటర్ల దూరంలో ఉంటుందని అంచనా. ఈ తుపాను చెన్నైలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నప్పటికీ.. అది తిన్నగా ఏపీవైపు కదిలే అవకాశాలుకూడా ఉన్నాయి. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
‘దిత్వాహ్’ తుపాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఉందని పేర్కొంది.
ఆదివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. తుపాను ప్రభావం చూపే అవకాశమున్న ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వచ్చే మూడ్రోజులు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ విభాగం సూచించింది.
