×
Ad

Cyclone Ditwah : హైఅలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాతావరణ రిపోర్ట్ ఇదే..

Cyclone Ditwah : తుపానుకు ‘దిత్వా’గా నామకరణం చేసింది. దీన్ని యెమెన్ సూచించింది. అక్కడ సోకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది.

Cyclone Ditwah

Cyclone Ditwah : ఏపీ ప్రజలను మరో తుపాను భయపెడుతుంది. సెన్వార్ తుపాన్ ముప్పు తప్పినప్పటికీ.. ‘దిత్వా’ రూపంలో మరో ముప్పు పొంచిఉంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుపానుగా బలపడినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. తుపానుకు ‘దిత్వా’గా నామకరణం చేసింది. దీన్ని యెమెన్ సూచించింది. అక్కడ సోకోట్రా ద్వీపంలోని ఒక ప్రసిద్ధ సరస్సు పేరు ఇది.

Also Read : TTD: అటు పరకామణి కేసు.. ఇటు కల్తీ నెయ్యి ఎపిసోడ్.. ఏం జరుగుతోంది?

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుపాను.. గడిచిన ఆరు గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో పయనించింది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు పుదుచ్చేరికి 460కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం అయింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుపాను.. నవంబర్ 30వ తేదీ ఉదయానికి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు చేరుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ప్రభావంతో నేటి నుంచి కోస్తాంధ్రలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఆదివారం కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 30వ తేదీన ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవాళ (శుక్రవారం) శ్రీపొట్టిశ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు (శనివారం) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆదివారం చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నంద్యాల, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చునని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

సోమవారం .. కృష్ణా, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది.