Cyclone Montha: మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి 3వేల చొప్పున నగదు ఇవ్వాలన్నారు. అలాగే 25 కిలోల బియ్యం సహా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్‌లను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు.
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తుఫాన్ రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటరీగా వచ్చే వారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా నిబద్ధతతో పని చేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదని తేల్చి చెప్పారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని.. అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని సీఎంకు వివరించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.
ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందుతుందని, రాష్ట్రంలో ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూసుకోవాలన్నారు చంద్రబాబు. ఇక, భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Also Read: ముంచుకొస్తున్న ముప్పు.. రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 97 రైళ్లు రద్దు..