Cyclone Montha: మొంథా తుపాను ఏపీలో విధ్వంసం సృష్టించింది. భారీగానే నష్టం మిగిల్చింది. మొంథా తుపాను మిగిల్చిన నష్టంపై ఏపీ సర్కార్ ప్రాథమిక అంచనా వేసింది. ప్రాథమిక నష్టం అంచనా దాదాపు రూ.5,265 కోట్లుగా తేల్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్ అండ్ బీకి రూ.2,079 కోట్ల నష్టం జరిగిందన్నారు.
ఆక్వా రంగంలో రూ.1,270 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇక వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు, మున్సిపల్ శాఖలో 109 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం జరిగిందన్నారు. హార్టికల్చర్ రంగంలో రూ.39 కోట్ల నష్టం జరగ్గా.. పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. తుపాను వల్ల 120 పశువులు చనిపోయాయి. కాగా, తుపాను వల్ల మనుషులు ఎవరూ చనిపోలేదని వెల్లడించారు.
టెక్నాలజీ సాయంతో తుపాను నష్టాన్ని తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా తుపాను పరిస్థితిని అంచనా వేశామన్నారు. మొంథా తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసి నష్ట నివారణ చేయగలిగామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, గ్రామ స్థాయి వరకు వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.
హుద్ హుద్ తుపానుతో విశాఖ అతలాకుతలమైందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. తిత్లీ తుపాను సమయంలోనూ సమర్థంగా పని చేశామన్నారు. బుడమేరు వరదను ఎదుర్కొన్నామన్నారు. విపత్తు సమయాల్లో టెక్నాలజీని సమర్థంగా వాడుతున్నామన్నారు. మొంథా తుపాను దాగుడుమూతలు ఆడిందని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ సమీపంలో తీరం దాటుతుందన్నారు, కానీ అంతర్వేది దగ్గర తీరం దాటి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయన్నారు. అనుకున్న చోట కాకుండా వేరే ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని సీఎం చంద్రబాబు వివరించారు.
Also Read: ‘మొంథా’ తుపాన్.. ఏపీలో ఎన్ని ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందో తెలుసా.. వాళ్లకు రూ.5లక్షలు