Cyclone Montha
Cyclone Montha: మొంథా తుపాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 18కిలో మీటర్ల వేగంతో తుపాను కదులుతుంది. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, విశాఖపట్నంకి 600 కి.మీ, కాకినాడకు 570 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్రతుపానుగా మారే అవకాశం ఉందని, 28వ తేదీ రాత్రికి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సహాయక చర్యల కోసం జిల్లాల్లో తొమ్మిది ఎస్డీఆర్ఎఫ్, ఏడు ఎన్డీఆర్ఎప్ బృందాలు రంగంలోకి దిగాయి. తుపాను ప్రభావంతో అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్ వద్ద రెండో నెంబర్, కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఐదు రోజులపాటు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
మొంథా తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలతో బయటకు రావాలని అధికారులు సూచించారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో తూర్పు కోస్ట్ రైల్వే జోన్ హై అలెర్ట్ జారీ చేసింది. రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం చేసింది. ట్రాక్ లు, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణ పునరుద్దరణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగించుకోవడానికి డీజిల్ లోకోమోటివ్ లు రెడీ చేశారు.
అదేవిధంగా.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల సహాయంకోసం స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. రద్దు చేసిన టికెట్లు వాపస్ కోసం అదనపు కౌంటర్లు అందుబాటులో ఉంచారు. ఆహార పంపిణీ కోసం క్యాటరింగ్ యూనిట్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాకప్ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 24గంటల పాటు మెడికల్ టీంలు, అంబులెన్సులు సిద్ధం చేశారు. తుపాను పరిస్థితులను వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్రా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.