18వ రోజు : రాజధాని బంద్

  • Publish Date - January 4, 2020 / 04:02 AM IST

అమరావతి ప్రాంత రైతుల ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు రైతుల ఉద్యమం ఉధృతమవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2020, జనవరి 04వ తేదీ శనివారం 29 గ్రామాల్లో బంద్‌ పాటించాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. దీంతో రైతులు బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు కొనసాగించనున్నారు. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు పలుచోట్ల నిర్వహించనున్నారు.

రైతుల ఆందోళనలకు మద్దతుగా అమరావతి అంతటా నిరసనలు కొనసాగనున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కొవ్వొత్తుల ర్యాలీకి అమరావతి పరిరక్షణ సమితి జిల్లాల నేతలకు పిలుపునిచ్చింది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు జిల్లాలో క్రొవ్వొత్తుల ర్యాలీలు జరునున్నాయి. ప్రధాన కూడళ్లలో ఈ ర్యాలీలు జరపాలని సమితి పిలుపునిచ్చింది. దీంతో జిల్లాల నేతలు ఇందుకు అనుగుణంగా ర్యాలీలకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

మరోవైపు అమరావతిలో మహిళా రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మందడంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పలువురిపై.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు అమరావతిలో మహిళలపై పోలీసుల దాడి వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి టీడీపీ నేతలతోపాటు, పలువురు మహిళలు తీసుకెళ్లారు. స్పందించిన మహిళా కమిషన్.. ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

 

Read More : KCR దిశానిర్దేశం : TRS విస్తృత స్థాయి సమావేశం