Tomato price
AP Tomato price: గత రెండు నెలుగా టమాటా ధరలు భారీగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో టమాటా లేకుండా వంటలు చేయనివారుసైతం రెండు నెలలుగా టమాటా అంటే బెంబేలెత్తిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఠారెత్తిపోయాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కిలో టమాటా రూ. 250కి చేరిపోయింది. దీంతో టమాటా సాగుచేసిన రైతులకు, దళారులకు కాసుల వర్షం కురిసింది. టమాటాకోసం దొంగతనాలుసైతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో కిలో టమాటా రూ. 10కి చేరడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు.
Tomato Price Hike : మండుతున్న టమాటా ధరలు .. ట్విట్టర్లో కామెడీ మీమ్స్
జులై నెలలో టమాటాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కిలో టమాటా రూ. 150 నుంచి రూ. 200 పలికింది. ఆగస్టు మొదటి వారం నుంచి ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఇప్పుడు కిలో టమాటా రూ. 10కి చేరింది. ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోళ్లు శుక్రవారం పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. రైతులు తొలిరోజే సుమారు 10 టన్నుల వరకు మార్కెట్ కు తెచ్చారు. వేలంలో క్వింటా టమాటాకు రూ. వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది. దీంతో కిలో టమాటా రూ. 10కి చేరింది. అయితే, బహిరంగ మార్కెట్ లో మాత్రం టమాటా కిలో రూ. 40 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారు.
Sunflower Cultivation : ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకువలు
ఏపీలోని పలు ప్రాంతాల్లో టమాటా పంట కోతకు రావడంతో టమాటా ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే కాలంలో కిలో టమాటా ధరలు గతంలోలా మామూలు స్థితికి చేరుతాయని, పేద ప్రజలు కొనుగోలు చేసే స్థాయిలో టమాటా ధరలు అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్రజలను ఠారెత్తించిన టమాటా ధరలు.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, పట్టణ కేంద్రాల్లోని మార్కెట్ లలో టమాటా ధరలు రూ. 50 వరకు ఉన్నాయి. టమాటా పంట చేతికొస్తుండటంతో మరికొద్ది రోజుల్లో పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్ లలోనూ టమాటా ధరలు తగ్గుముఖం పడతాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.