తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్‌ చేయడంలో జాప్యంపై ఏపీ డీజీపీ ఆఫీస్ సీరియస్.. విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరులో గాలింపు..

మరికొందరు వైసీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్‌ చేయడంలో జాప్యంపై ఏపీ డీజీపీ ఆఫీస్ సీరియస్ అయింది. ప్రకాశ్ రెడ్డి అరెస్ట్‌లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై నివేదిక ఇవ్వాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు ఆదేశాలు ఇచ్చింది. తోపుదుర్తి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరులో ప్రకాశ్ రెడ్డి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ పగిలిపోయిన ఘటనలో ఇప్పటికే 11 మంది వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు వైసీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, 20 రోజులకు పైగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని కనిపించడంలేదు. కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? లేక బెయిల్ కోసం ఇంటర్నల్ గా ప్రయత్నాలు చేస్తున్నారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

Also Read: గేమింగ్‌కు అనుగుణంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని భావిస్తున్నారా? అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి తెలుసుకోవాల్సిందే..

అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటన ఆయన మెడకు ఉచ్చు బిగిసేలా తయారైంది. హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది.

జనం హెలికాప్టర్ వైపు దూసుకెళ్లేలా ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టారని, ఓ కానిస్టేబుల్ కి గాయాలు కావడంతో అతనిచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశ్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. దీంతో అప్పటివరకు అందరికీ అందుబాటులో ఉన్న ప్రకాశ్ రెడ్డి..ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనపై బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో అరెస్టు తప్పదన్న భయంతోనే వెళ్లిపోయారంటూ అంతా టాక్ వినిపిస్తోంది. గత 20 రోజులుగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది.

అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రకాశ్ రెడ్డి కోసం పోలీసులు విసృతంగా గాలిస్తున్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ప్రకాష్ రెడ్డికి చుక్కెదురే అయింది. ఈ కేసులో మొత్తం ఐదుగురికి బెయిల్ రాగా ప్రకాష్ రెడ్డికి మాత్రం ముందస్తు బెయిల్ రాలేదు. మొత్తంమీద మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మెడకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. పాత కేసుల భయంతోనే ప్రకాశ్ పరారీలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన అరెస్ట్ ఖాయమని పోలీసుల వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.