ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్ ఫస్ట్ రిపోర్ట్‌లో ఏముంది..? ఏలూరును గజగజలాడిస్తున్న వింత వ్యాధిపై ఎయిమ్స్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. వైరస్ వల్ల ఆహారం, నీళ్లు కలుషితం అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. భార లోహాలు లేదా రసాయన మూలకాలు కలవడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ఈ పరిస్థితి ఒకటో తారీఖు నుంచే కొంతమంది ఉందని.. ఆ రోజు నుంచే అస్వస్థతకు గురై కొంతమంది ఆసుపత్రుల్లో చేరినట్లు ఎయిమ్స్ తేల్చింది. ఐదో తేదీ రాత్రి 8 గంటల తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరిగిందని నిర్థారించింది.
AIMS బృందం పరిశీలన : –
తాజాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముగ్గురు డాక్టర్ల ఢిల్లీ ఎయిమ్స్ బృందం పరిశీలించింది. అసలేం జరిగిందని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నుంచి వివరాలు సేకరించింది. WHO బృందం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిల్లో పేషంట్లతో మాట్లాడి రిపోర్ట్స్ సిద్ధం చేశారు. వింత వ్యాధి బాధితులు ఉన్న కాలనీల్లో రెండు రోజులు పర్యటించిన మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు.. 40 శాంపిల్స్ తీసుకుని ఢిల్లీకి పంపించారు. అటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ డిపార్ట్‌మెంట్ రెండో రోజు జరిపిన పరిశోధనల్లో పేషేంట్ల దగ్గర 100 రకాల శాంపిళ్లను తీసుకుంది. మరో వంద రకాల శాంపిళ్లను కాలనీల్లో సేకరించి బియ్యం, పప్పులు, నీళ్లు, యూరిన్ లాంటి శాంపిళ్లను పుణెకు తీసుకెళ్లారు. ఏలూరు వింతవ్యాధి కారణాలను పూర్తి స్ధాయిలో తేల్చి కేంద్రం అధికారికంగా బయటపెట్టనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో ఏలూరులో చేపట్టాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించబోతోంది.