ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారికి, వీరితో కాంటాక్ట్ అయిన వారికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని విశ్లేషించుకుని ఆ మేరకు వైద్య పరీక్షల విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్న సీఎం సూచించారు. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం సీఎం జగన్..ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు.
ఢిల్లీలోని తబ్లీగీ జమాతే సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్ట్ అయిన వారికి వైద్య పరీక్షలపై సీఎంకు వివరాలు అందించారు అధికారులు. ఢిల్లీలో జమాత్‌కు 1085 మంది హాజరయ్యారని, వీరిలో రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946 మందిని గుర్తించామని వెల్లడించారు. ఈ 946 మందిలో 881 మంది ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాయని, 108 మంది పాజిటివ్‌గా కేసులుగా నిర్ధారణ అయ్యాయన్నారు. ఇంకా 65 మందికి సంబంధించి ల్యాబ్ నుంచి ఫలితాలు రావాలన్న తెలిపారు.
పైన పేర్కొన్న 946 మందితో కాంటాక్ట్ అయినవారిలో 616 మంది పరీక్షలు నిర్వహించగా ఇందులో 32 మంది పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు. కాంటాక్ట్ అయిన మరో 335 మంది ల్యాబ్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 161 పాజిటివ్ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లిన వారు కాగా…వారిలో కాంటాక్ట్ అయినవారేనని అధికారుల వెల్లడి.
* ఇంటింటి సర్వేపై సీఎం ఆరా
* రాష్ట్రంలో ఇంటింటికీ నిర్వహించిన సర్వేపై కూడా సీఎం జగన్ ఆరా తీశారు.
* రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని తెలిపిన అధికారులు.
* రాష్ట్ర వ్యాప్తంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లాంటి ఏదో ఒక లక్షణం ఉన్నవారిని గుర్తించారు.
* రెండోదశలో భాగంగా వీరిని పరిశీలిస్తారని, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు.
* కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా డాక్టర్లను నియమించారా లేదా? అని ప్రశ్నించారు సీఎం జగన్.