జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే ఉంటారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పవన్ ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదన్నారు. కొన్నేళ్లుగా చంద్రబాబు తొత్తుగా పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏదైనా లాభం ఉంటుందేమోనని పవన్ అమరావతిలో తిరుగుతున్నారని మంత్రి విమర్శించారు. పవన్ కన్నా ఆయన అన్న చిరంజీవి మేలు అని మంత్రి చెప్పారు. చిరంజీవికి ప్రజల బాధలు తెలుసని.. అందుకే రాజధాని అంశంలో జగన్ కు మద్దతు పలికారని మంత్రి అన్నారు.
మంగళవారం(డిసెంబర్ 31,2019) రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకెళ్లొచ్చిన వారు కాదు.. సూట్ కేసుల కంపెనీవారు కాదు ..కష్టాన్ని నమ్ముకున్న వారు ..మట్టిని సాగు చేసి బంగారాన్ని పండిచేవారు. అటువంటి రైతుల్ని కష్టాల పాలు చేసే ప్రభుత్వం మనుగడ సాగించదని పవన్ హెచ్చరించారు.
జగన్ రెడ్డిగారికి ప్రజలు అధికారం ఇచ్చింది నాలుగు గోడల మధ్య ఉండే ఆడ బిడ్డలను నడి రోడ్డు మీద కూర్చోబెట్టడానికి కాదన్నారు. ప్రజలను సంతోషంగా ఉంచటానికి అధికారం ఇస్తే రైతుల కళ్ల నుంచి రక్తాన్ని చిందిస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగిన జగన్ రెడ్డిగారికి 151 సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే ఇలా జరిగిందన్నారు. మరోసారి అధికారం ఇస్తారో లేదో ప్రజలే నిర్ణయించుకోవాలని పవన్ సూచించారు.