నాయకత్వ మార్పుతోనే : శ్రీకాకుళం టీడీపీలో కూన రవికే పదవి?

  • Publish Date - December 20, 2019 / 12:17 PM IST

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా కంచుకోటలా నిలిచింది. మధ్యలో 2004లోనూ, ఇప్పుడు 2019లో మాత్రమే పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అలాంటి పార్టీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు తీసుకువెళ్లడానికి సమర్థమైన నాయకత్వం అవసరమని చంద్రబాబు గుర్తించారు.

తన ఆలోచనను ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జరిగిన పార్టీ సమావేశంలో బయటపెట్టారట. జిల్లాలో సమర్థ నాయకత్వంలో గ్రామ స్థాయిలో ఉన్న బలమైన కేడర్‌ను ఒక తాటిపైకి తెచ్చి, రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. 

నాయకత్వ మార్పు తప్పదు :
జిల్లాలో పార్టీకి నాయకత్వ మార్పు తక్షణ అవసరమని స్పష్టం చేశారట చంద్రబాబు. జిల్లాలో పార్టీ మనుగడకు, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసేందుకు కూన రవికుమార్ అయితే సమర్థుడని అభిప్రాయంలో అధినేత చంద్రబాబు ఉన్నారట. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై, విధానపరమైన నిర్ణయాలపై ఏకాభిప్రాయం అవసరమని జిల్లా నాయకులు సూచించారట. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా మార్పు తప్పదని బాబు స్పష్టం చేశారంటున్నారు. 

పార్టీలో కీలకమైన కింజరాపు కుటుంబం కూడా కూన రవి నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయడు గెలిచారని, వారితో కలిసి కూన రవికుమార్ కలిసి పని చేస్తే పార్టీకి భవిష్యత్‌లో తిరుగుండదని చంద్రబాబు ఆలోచనగా ఉందంట. మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు సైతం కూనకు మద్దతిస్తున్నారట. 

ఇలాంటి పరిస్థితుల్లో ఆమదాలవలసకు చెందిన కూన రవికుమార్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించడం వల్ల శ్రీకాకుళం, పాలకొండ డివిజన్లలో పార్టీ బలపడుతుందని అధినాయకత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న గౌతు శిరీషను రాష్ట్ర కమిటీలోకి తీసుకువెళ్లి, కూన రవి కుమార్‌కు జిల్లా పార్టీ వ్యవహారాలు అప్పగిస్తారని అంటున్నారు.