Donthireddy Vemareddy: వాటి గురించి అందరికీ చెప్పే అవసరం లేదు: వేమారెడ్డి

సీఎంవో నుంచి గతంలో చాలాసార్లు పిలుపు వచ్చినా అక్కడికి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్లలేదని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు.

Alla Ramakrishna Reddy-Donthireddy Vemareddy

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను ఆమె వెంటే నడుస్తానని, వైసీపీ సర్కారు తీరు సరిగ్గాలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల సొంత ప్రయోజనాల కోసమే వైసీపీకి రాజీనామా చేశారన్నారు.

సీఎంవో నుంచి గతంలో చాలాసార్లు పిలుపు వచ్చినా అక్కడికి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్లలేదని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు. ఆయన రాజీనామా వల్ల తమ పార్టీకి నష్టంలేదని చెప్పుకొచ్చారు. సీఎంను ప్రజాప్రతినిధులు అనేక సమస్యలపై కలుస్తారని, వాటి గురించి అందరికి చెప్పే అవసరం లేదని అన్నారు.

రామకృష్ణారెడ్డి మంగళగిరిలో కార్పొరేషన్ నిధులతోనే అభివృద్ధి పనులు చేశారుగానీ, ఆయన సొంత నిధులతో కాదు కదా అని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని, దీని ప్రభావం భవిష్యత్తులో ఉంటుందని అన్నారు.

తమ పార్టీలో కొందరు విభేదాలు సృష్టించాలనుకుంటున్నారని దొంతిరెడ్డి వేమారెడ్డి చెప్పారు. సీఎం మీద ఆరోపణలు మోపడానికి ఆళ్ల రామకృష్ణకు అర్హత లేదని అన్నారు. పార్టీ మారే వారు ఆరోపణలు చేస్తూనే ఉండడం సాధారణమేనని చెప్పారు. మంగళగిరిలో వైసీపీ మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గుంటూరు వైసీపీ కార్యాలయంపై దాడి.. వాళ్లను వదిలేది లేదంటూ మంత్రి రజిని సీరియస్ వార్నింగ్