గుంటూరు వైసీపీ కార్యాలయంపై దాడి.. వాళ్లను వదిలేది లేదంటూ మంత్రి రజిని సీరియస్ వార్నింగ్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఇవాళ ప్రారంభించాల్సి ఉంది.. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు కార్యాలయంపై రాళ్ల దాడిచేశారు.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి విడుదల రజని అన్నారు.

Minister Vidadala Rajini
Minister Vidadala Rajini : నూతన సంవత్సరం వేళ గుంటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రమౌళి నగర్ లోని వైసీపీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని నియమితులైన విషయం తెలిసిందే. నూతన ఏడాది పురస్కరించుకొని కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. అయితే, ఆదివారం అర్థరాత్రి న్యూ ఇయర్ ర్యాలీలో భాగంగా అటువైపు వచ్చిన కొంతమంది యువకులు కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : తండ్రీ కొడుకుల మధ్య టికెట్ వార్.. అమలాపురం వైసీపీలో రసవత్తర రాజకీయం
మంత్రి విడదల రజిని సీరియస్ ..
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం ఇవాళ ఓపెనింగ్ చేయాల్సి ఉంది.. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు కార్యాలయంపై రాళ్ల దాడిచేశారు.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి విడుదల రజని అన్నారు. సోమవారం ఉదయం ఆమె కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పక్కా ప్రణాళికతో దాడి చేయించారు.. రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని అన్నారు. బీసీ మహిళ పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని తట్టుకోలేక పోతున్నారని, ఓడిపోతున్నామనే భయంతోనే టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడిందంటూ మంత్రి విడుదల రజిని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి.. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను.. ప్రజల మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటానని అన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని మంత్రి రజిని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్ లు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని, బీసీలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుందని అన్నారు. పక్కా ప్రణాళికతో రాళ్ల దాడి చేశారు.. లాఠీచార్జ్ చేసినప్పటికీ దాడి కొనసాగించారని రజిని అన్నారు.
ముద్దాలి గిరి కామెంట్స్..
ఎమ్మెల్యే ముద్దాలి గిరి మాట్లాడుతూ.. వైసీపీ కార్యాలయం ప్రారంభించుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో చెప్పారు అంటూ టీడీపీ పై విమర్శలు చేశారు. బీసీ మహిళ పోటీ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. గత ఐదేళ్లలో ఒక చిన్నదాడి కూడా జరగలేదు. వైసీపీ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడిన వారిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై డీఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రాత్రి కొంతమంది రాళ్ళు రువ్వి వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. కేసు నమోదు చేశాం. దాడి వెనుక ఎవరున్నారో విచారిస్తున్నామని తెలిపారు.