Tirupati
Tirupati Sri Govindaraja Swamy : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్‌చల్ చేశాడు. ఏకాంత సేవ ముగిసిన తరువాత ఆలయంలోకి ప్రవేశించిన వ్యక్తి.. ఆలయం గోపురంపైకి ఎక్కిన నినాదాలు చేశాడు. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అతడ్ని కిందకు దిగాలని సూచించారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మాత్రం కిందకు వచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మూడు గంటలపాటు హైడ్రామా అనంతరం అతడ్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Pushya Pournami: జనవరి 3.. పుష్య పౌర్ణమి.. చాలా శక్తిమంతమైన రోజు.. ఇలా చేస్తే శని దోషాలన్నీ దూరం..!
నిందితుడు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతిగా గుర్తించారు. ఆలయం మూతపడిన తరువాత భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ప్రవేశించాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురంపైకి ఎక్కి.. కలశాలు, విద్యుత్ దీపాలు స్వల్పంగా ధ్వంసం చేశాడు. గోపురం పైకెక్కిన వ్యక్తిని కిందకు దింపేందుకు తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించారు. గోపురం నుంచి దిగేందుకు అతడు విచిత్రమైన షరతు పెట్టాడు. “క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందికి దిగుతాను” అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.
మూడు గంటలపాటు హైడ్రామా అనంతరం తాళ్లు, నిచ్చెన సాయంతో ఆలయ గోపురం ఎక్కిన సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సురక్షితంగా గోపురం నుంచి కిందకు దింది.. ఆ తరువాత ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతికి మతిస్థిమితం సరిగా లేనట్లుగా అనుమానిస్తున్నారు.
మద్యం మత్తులో అక్రమంగా ఆలయంలోకి చొరబడిన వ్యక్తిని గుర్తించడంలో టిటిడి విజిలెన్స్ విఫలమైంది. విజిలెన్స్ సిబ్బంది గుర్తించేలోపే ఆలయం గోడ దూకి వ్యక్తి లోపలికి వచ్చాడు. ఈ ఘటనతో ఆలయ భద్రత, విజిలెన్స్ వ్యవస్థ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకైన ఆలయంలోకి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి సులభంగా ప్రవేశించడంపై టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు.