Dutta Ramachandrarao
Dutta Ramachandrarao -Balashowry : కృష్ణాజిల్లా గన్నవరం(Gannavaram)లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వైసీపీ (YCP) నేత దుట్టా రామచంద్రరావుతో ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దుట్టా రామచంద్రరావును ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే గన్నవరం నియోజకవర్గ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీకి మద్దతు తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నాయకత్వాన్ని దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దుట్టా రామచంద్రరావుతో వల్లభనేని బాలశౌరి సమావేశమైనట్లు తెలుస్తోంది.
Dutta Ramachandrarao -Balashowry
వల్లభనేని బాలశౌరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… తమ పార్టీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుని మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం దుట్టా రామచంద్రరావు ఎంతగానో కష్టపడ్డారని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్టా రామచంద్రరావు ఒకరని చెప్పారు. కొన్ని రోజుల క్రితం జగన్ ని దుట్టా రామచంద్రరావు కలిశారని అన్నారు. జగన్ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్టా అని చెప్పారు.
ఈ సందర్భంగా దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ… ఎంపీ బాలశౌరికి, తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇద్దరమూ వైఎస్సార్ శిష్యులుగా సుదీర్ఘకాలం పనిచేశామని అన్నారు. మూడు నెలల క్రితం జగన్ ను కలిశానని చెప్పారు. జగన్ కి తన అభిప్రాయం చెప్పానని తెలిపారు. ఇప్పుడు ఎంపీ బాలశౌరికీ అదే చెప్పానని స్పష్టం చేశారు.