Ganganamma Jatara
Ganganamma Jatara : ఏడేళ్లకోసారి నిర్వహించే ఏలూరు పడమరవీధి గంగానమ్మ జాతర ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. 150ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఉత్సవంలో దేశ విదేశాల్లో స్థిరపడిన, తెలుగు రాష్ట్రాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఉదయం 11.15 గంటలకు వంగాయగూడెంలోని ఆదిమహాలక్ష్మమ్మ ఆలయ సమీపంలో వేప చెట్టుకు శాస్త్రోక్తంగా ఘనాచార్యలు ముడుపుకట్టారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ బొడ్డు అప్పలనాయుడు, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఆలయంలో కొలువైన అమ్మవారు, పోతురాజుబాబుకు పూజలు నిర్వహించారు.
ఏడు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. జాతర సమయంలో అమ్మవారు నగర సంచారం చేస్తుందని చెబుతారు. ఏలూరులో తూర్పు వీధి, పడమర వీధులలో ప్రధానంగా గంగానమ్మ ఆలయాలు కొలువుదీరి ఉన్నాయి. శ్రీ ఆది మహాలక్ష్మి, శ్రీ గంగానమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవం 2026 ఫిబ్రవరి 2వ తేదీ వరకు మూడు నెలల పాటు కొనసాగనుంది. చలువ పందిరి రాట మహోత్సవంతో నిర్వాహకులు జాతరకు శ్రీకారం చుట్టారు. ఆఖరి ఘట్టంగా అమ్మవారిని సాగనంపే కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తామని కమిటీ తెలిపింది.
ఈ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, ఇతర వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి. జాతర సందర్భంగా కలశాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే మహిళా భక్తులతో ఏలూరు నగరం సందడిగా మారుతుంది. మహాకుంభం సమర్పించే రోజున పెద్దఎత్తున అన్నపురాశిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు.
అయితే, ఈ జాతర జరిగే మూడు నెలలపాటు ఏలూరులో శుభకార్యాలు బంద్ కానున్నాయి. కనీసం కొత్త బట్టలు ధరించేందుకు కూడా అవకాశం లేదని ఘనాచార్యలు తెలిపారు. జాతర కొనసాగినన్ని రోజులు నగరంలో వివాహాలు, పుట్టిన రోజులు, వ్రతాలు తదితర శుభకార్యాలు నిర్వహించకపోవడం ఆచారంగా వస్తోంది. జాతర మహోత్సవంలో ఏలూరు ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొంటున్నారని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.