VV Lakshmi Narayana: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ రాజకీయాలు, జగన్ పాలన, కూటమి ప్రభుత్వ పాలన, సీఎం చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్, జనసేనాని పవన్ కల్యాణ్ వైఖరి, జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేయడం.. ఇలా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు జగన్ చేసిన తప్పే నేడు సీఎం చంద్రబాబు చేస్తున్నారా? ఆ తప్పు ఏంటి? కూటమి ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటి? లక్ష్మీనారాయణ చేసిన సూచనలు, సలహాలు ఏంటి..
”కూటమి పాలన ప్రధానంగా రెండు అంశాలపై జరుగుతోంది. ఒకటి అమరావతి, రెండోది పోలవరం. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ఇప్పటివరకు 2లక్షల కోట్ల అప్పులు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ సహా మేమంతా కోరుకున్నది ఒకటే. ఉచితాలను లిమిట్ చేయండి. వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు మాత్రమే పరిమితం చేయండి. మిగతా వాళ్లకు ఉపాధి కల్పించండి. దాని మీద మనం దృష్టి పెట్టాలి.
డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం. జగన్ ప్రభుత్వంలో అప్పులు తెచ్చారని మనమే అన్నాం. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. మళ్లీ అప్పులు తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఏమవుతాయి? రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని సీఏజీ రిపోర్టు ఇచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని నివేదిక ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము అదిస్తాం, ఇదిస్తాం అంటున్నారు. మీ అందరిని చంద్రుడి మీదకు తీసుకెళ్తాం అని కూడా హామీ ఇస్తున్నారు. ఇలాంటి హామీలకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడాలి.
కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటే.. ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలి. ఒక ప్రాంతం కాదు ప్రతి జిల్లా అభివృద్ధి అవ్వాలి. నిరుద్యోగ సమస్య చాలా ప్రధానమైన సమస్య. దేశంలోనే పెద్ద సమస్య. ఉపాధి అవకాశాలు ఎలా కల్పించగలం అన్న ఆలోచన చేయాలి. అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోంచి తీసేయాలి. సస్పెండ్ చేయాలి. అల్టిమేట్ గా కావాల్సింది ప్రజా పాలన. ప్రజల అభివృద్ధి. దాన్ని మీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు అంటే.. ఒకరిద్దరిని పార్టీ నుంచి తీసేస్తే.. సిస్టమ్ సెట్ అవుతుంది” అని వీవీ లక్ష్మీనారాయణ హితవు పలికారు.
Also Read: మంచి పాలన అందిస్తే.. జగన్ 11 సీట్లకే ఎందుకు పరిమితమైపోయారు? ప్రజలు ఎందుకు తిరస్కరించారు?